TGSPDCL: వేసవిలో విద్యుత్ సమస్యలకు TGSPDCL స్మార్ట్ పరిష్కారం
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలకు సమర్థవంతమైన పరిష్కారం చూపేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు సంతోషకరమైన సమాచారం తెలియజేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని వినియోగించాలనుకునే వారు తమ మొబైల్ ఫోన్‌లో 87124 41912 నంబర్‌ను సేవ్ చేసి, వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపితే సేవలు ప్రారంభమవుతాయి. ఈ చాట్‌బాట్ ద్వారా వినియోగదారులు ఫిర్యాదులను నమోదు చేయగలరు, ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోగలరు. అదేవిధంగా విద్యుత్ బిల్లుల వివరాలు, ప్రస్తుత సరఫరా సమాచారం వంటి అనేక అంశాలను సులభంగా పొందే వీలుంది.
వివరాలు
కరెంట్ బిల్లుల పేరుతో జరిగే సైబర్ మోసాల నుంచి రక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా ఈ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసినట్లు, దీని ద్వారా వేగవంతమైన,సమర్థమైన సేవలు అందించగలమని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. ఇటీవలి కాలంలో విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఆయన సూచించారు. "మీ బిల్లు బాకీ ఉంది, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ నిలిపివేస్తాం" అంటూ వచ్చే బెదిరింపు కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా, వెంటనే అధికారిక వాట్సాప్ చాట్‌బాట్ సేవను ఉపయోగించి అసలు బిల్లు వివరాలను తనిఖీ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి వినియోగదారు ఈ నంబర్‌ను సేవ్ చేసుకుంటే మోసాల నుంచి రక్షణ పొందవచ్చని ఫరూఖీ స్పష్టం చేశారు.