LOADING...
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 షాపులు !
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 షాపులు !

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 షాపులు !

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, కొత్తగా వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీజీఎస్‌ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మొత్తం 694 ఖాళీ షాపులను లీజుకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

వివరాలు 

పలు రకాల వ్యాపారాలకు అనుకూలం

ఆర్టీసీ అందిస్తున్న ఈ వాణిజ్య స్థలాల్లో హోటళ్లు, ఫుడ్ కోర్టులు, షోరూమ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధాన నగరాలు, బస్టాండ్లు, పట్టణాలు, డిపోలకు అనుబంధంగా ఉన్న ఈ షాపులు వ్యాపార కార్యకలాపాలకు అనువుగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లలో ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌లు, రిటైల్ దుకాణాలు వంటి వ్యాపారాలకు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

వివరాలు 

పూర్తిగా ఆన్‌లైన్‌లో కేటాయింపు

షాపుల కేటాయింపు ప్రక్రియను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. దీంతో మధ్యవర్తులు లేదా దళారుల జోక్యానికి అవకాశం ఉండదని తెలిపింది. స్పష్టమైన నిబంధనలతో టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఖాళీగా ఉన్న షాపుల వివరాలు, లీజు కాలపరిమితి, అద్దె చార్జీలు, ప్రస్తుతం ఉన్న స్థితి తదితర సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు 

ఉపాధి అవకాశాలే లక్ష్యం

సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ అవకాశాన్ని వ్యాపార వృద్ధికి వినియోగించుకోవాలని వ్యాపార వర్గాలకు సూచించింది. టీజీఎస్‌ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సంస్థ ఎండీ నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement