కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. స్థానిక పోలీసులతో సహా సుమారు 12 కంపెనీల పారామిలటరీ బలగాలను వేదిక వద్ద మోహరించింది. ఈ ర్యాలీకి దాదాపు లక్ష మంది హాజరుకానున్నట్లు ఆప్ అధికార ప్రతినిధి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ విషయాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు నిరసనగా దిల్లీ అధికార పార్టీ ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించాలని, దిల్లీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆప్ పేర్కొంది.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేజ్రీవాల్ పిలుపు
దిల్లీ ప్రజల హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దిల్లీ ప్రజలు రామ్‌లీలా మైదాన్‌కు తరలివచ్చి నిరసన తెలుపుతారని సీఎం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. మైదానంలోని ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేస్తారు. వేదికపైకి ప్రవేశించే వారిని తనిఖీ చేస్తారు. దిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం సోరెన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సీపీఎం నేత సీతారాం ఏచూరి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు.