జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.
కశ్మీర్ లోతట్టు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన సుమారు రెండేళ్లుగా చర్చలో ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సాయుధ బలగాలతో కశ్మీర్ లోయలో భద్రతా వ్యవస్థ పటిష్టంగా, అధునాతనంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
అదనపు బలగాలను తొలగించిన చోట ఆ స్థానంలో జమ్ముకశ్మీర్ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో భర్తీ చేయాలని ఇప్పటికే ప్రతిపాదించారు.
జమ్ముకశ్మీర్
ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా, కార్యరూపం ఎప్పటికి దాల్చుతుందో?
అదనపు బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియపై మంత్రిత్వ శాఖల స్థాయిలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు సీనియర్ భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తెలియదని అంటున్నారు. అంతిమంగా ఇది రాజకీయ నిర్ణయం ద్వారానే అవుతుందని పేర్కొన్నారు.
కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికే కేంద్రం ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. 2019లో ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత భద్రతా సిబ్బంది హత్యలు 50 శాతం తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. లోయలో హింస క్రమంగా తగ్గిందని కేంద్రం అంటోంది. లోయలో బలగాలను ఉపసంహరించుకుంటే మళ్లీ పాత కథ మొదలయ్యే అవకాశమూ లేకపోలేదని నిపుణులు అంటున్నారు.