
Khammam: పాఠశాల మూతపడకుండా కాపాడిన బాలిక.. నేడు అదే పాఠశాలకు ప్రచారకర్త
ఈ వార్తాకథనం ఏంటి
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో(2024-25)నందిగామ కీర్తన అనే బాలిక ఒక్కరే నాలుగో తరగతిలో చేరింది. గతేడాది కూడా ఈపాఠశాలలో కీర్తన ఒక్కరే విద్యార్థినిగా ఉండగా,ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాల మూతపడకుండా కొనసాగించారు. ఉపాధ్యాయురాలు ఉమాపావని ఆమెకు నిత్యం పాఠాలు చెప్పడమే కాకుండా మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించారు. ఈఏడాది పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,అదనపు కలెక్టర్ శ్రీజ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పాఠశాల కొనసాగుదలకు ప్రధాన కారణమైన కీర్తనకు గుర్తింపుగా ఆమె చిత్రాన్ని ఇటీవల బడిగోడపై చిత్రించారు. పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలన్నఉద్దేశంతో దాదాపు రూ.5లక్షల ఖర్చుతో విద్యుత్ ఫెన్సింగ్,మరుగుదొడ్లు,నీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
వివరాలు
పిల్లలు పాఠశాలకు సులభంగా రాగలిగేలా ఆటో సదుపాయం
గత గురువారం కలెక్టర్,అదనపు కలెక్టర్ బడిని సందర్శించి చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కీర్తనతో ప్రత్యేకంగా మాట్లాడారు."నీవు స్నేహితుల కోసం ఎదురుచూస్తున్నావు కదా? ఇక్కడ మంచి బోధన జరుగుతోంది అని చెప్పి వారిని ఈ బడికి తీసుకురా" అని ఆమెను ప్రోత్సహించారు. పిల్లలు పాఠశాలకు సులభంగా రాగలిగేలా ఆటో సదుపాయం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇంకా,ఉపాధ్యాయుడైన రాంబాబును ఈ పాఠశాలకు కేటాయించనున్నట్టు కూడా ప్రకటించారు. నారపునేనిపల్లి గ్రామంలో ఏడో తరగతిలో చదివే 29 మంది పిల్లలు ఉన్నా,వారు ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారిలో 12మంది తమ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు అంగీకరించినట్టు అధికారులు తెలియజేశారు.