Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీలో పడటంతో ఆలయ నిర్వాహకులు దానిని దేవుడి ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడినా అది దేవుడి సొత్తు అని ఆలయ సంప్రదాయాన్ని ముందుకు తెచ్చిన నిర్వాహకులు, భక్తుడి ఫోన్‌ను తిరిగి ఇవ్వనట్లు తెలిపారు. వినాయకపురం నివాసి దినేష్, నెల రోజుల క్రితం కుటుంబ సమేతంగా అరుల్మిగు కంద స్వామి ఆలయాన్ని దర్శించేందుకు వెళ్లాడు. పూజ అనంతరం హుండీలో విరాళం వేసే క్రమంలో అతని చొక్కా జేబులోని ఐఫోన్ జారి హుండీలో పడింది.
సిమ్ కార్డు తిరిగి ఇచ్చేసిన ఆలయాధికారులు
హుండీ ఎత్తుగా ఉండటంతో దానిని తీయలేకపోయాడు. గందరగోళానికి గురైన దినేష్, ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు తెలిపాడు. అయితే హుండీలో పడిన తర్వాత ఆ వస్తువు దేవుడి సొత్తుగా పరిగణించాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేశారు. దినేష్ హిందూ ధార్మిక, చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. హుండీ త్వరగా తెరవాలని విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం హుండీని తెరిచిన తర్వాత దినేష్ ఫోన్ కోసం వచ్చాడు. అయితే ఫోన్ ఆలయ ఆస్తి అని ప్రకటించి, కేవలం ఫోన్ సిమ్ కార్డును మాత్రమే తిరిగి ఇచ్చారు.
హుండీలో ఏ వస్తువు పడినా అది దేవుడి సొత్తే
అంతేకాకుండా, ఫోన్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలయ అధికార కార్యనిర్వాహకుడు కుమారవేల్ ఈ అంశంపై మాట్లాడారు. ఈ విషయం ఉద్దేశపూర్వకమా లేక పొరపాటున జరిగిందా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. తమ సంప్రదాయాల ప్రకారం హుండీలో ఏ వస్తువు పడినా అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని, భక్తుల భద్రత కోసం హుండీకి పూర్తి రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. దినేష్ ఫోన్‌ను తిరిగి ఇవ్వకపోవడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.