Page Loader
సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత
ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవాన్ని నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు

సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

వ్రాసిన వారు Stalin
Jan 12, 2023
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది. పర్యావరణానికి హాని కలిగించేలా.. అక్రమంగా ఈశా యోగా కేంద్రానికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పీఐఎల్) హైకోర్టులో దాఖలైంది. పిల్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, యోగా కేంద్రంతోపాటు 14 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జనవరి 15న ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు యోగా కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. హైకోర్టు స్టే విధించడంతో కార్యక్రమం నిలిచిపోయింది.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధిపై ప్రభావం: పీఐఎల్

చిక్కబళ్లాపురానికి చెందిన క్యాతప్పతో పాటు పలువురు గ్రామస్థులు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌లో కీలక విషయాలను కోర్టుకు విన్నవించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ.. శతాబ్దాల చరిత్ర ఉన్న నంది హిల్స్, నరసింహ దేవరు రేంజ్ (బెట్ట) దిగువ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ, సహజ నీటి వనరులను నాశనం చేయడానికి అధికారులు అనుమతులు ఇచ్చిన ఆ పిల్‌లో ఆరోపించారు. నంది హిల్స్ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధి, పశువులు, వన్యప్రాణులపై తాజా నిర్మాణాల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తర పినాకిని, దక్షిణ పినాకిని నదులు నంది హిల్స్‌లో ఉద్భవించాయని, తాజా జరుగుతున్నకట్టడాల వల్లఅవి ప్రభావితమవుతాయని ఫిర్యాదుదారులు వివరించారు.