Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు
1999లో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో చోటు చేసుకున్న భీకర యుద్ధం భారతీయులకు చిరస్మరణీయం. పాకిస్థాన్ ఆక్రమణ యత్నాలను భారత సైన్యం ధైర్యంగా తిప్పికొట్టి చరిత్ర సృష్టించింది. ఈ యుద్ధంలో మన జవాన్ల విజయానికి కీలకంగా మారింది. ఓ సామాన్య గొర్రెల కాపరి చేసిన తాషి నామ్‌గ్యాల్ చేసి ప్రయత్నం మరవలేనిది. పాక్ సైన్యం చొరబాటును ముందుగానే గమనించి, అది భారత జవాన్లకు తెలియజేయడంతో, శత్రువులపై విజయం సాధించడం సాధ్యమైంది. ఆ గమనికతో భారత సైన్యం అప్రమత్తమై పాక్ కుట్రను భగ్నం చేసింది. కార్గిల్ యుద్ధంలో ఈ గొర్రెల కాపరి పాత్రను భారత సైన్యం తీరని ఋణంగా భావించింది. తాజాగా లద్దాఖ్‌లోని ఆర్యన్ వ్యాలీలో నివసిస్తున్న తాషి నామ్‌గ్యాల్ (58) హఠాత్తుగా కన్నుమూశారు.
దేశ భక్తుడిని కోల్పోయాం
లేహ్‌లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఏడాది ఆరంభంలో కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ద్రాస్‌లో జరిగిన వేడుకలకు తాషి హాజరయ్యారు. తాషి నామ్‌గ్యాల్ మరణ వార్తపై భారత సైన్యం స్పందించింది. ఓ దేశభక్తుడిని కోల్పోయామని, లద్దాఖ్ ధైర్యానికి ఈ విధి తీరని నష్టమని పేర్కొంది. 1999 ఆపరేషన్ విజయ్‌లో ఆయన అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాంటూ ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాషి సేవలు దేశానికి ఎనలేని భద్రతను అందించడంలో ఎంతగానో దోహదం చేశాయి. ఆయన దేశానికి చేసిన సేవలు భారతీయుల గుండెల్లో సువర్ణాక్షరాలుగా నిలిచిపోతాయి.