Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని భావిస్తారు. కానీ వాతావరణ మార్పుల ప్రభావంతో జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితి వేసవి ముందుగానే వచ్చేసిందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది. ఏటా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతుండగా, గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు పొందింది.
2025లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల
2023లో ఆరు నెలలు, 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901 నుంచి సేకరించిన వాతావరణ సమాచారం ప్రకారం, 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. సగటు ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు పెరిగింది.
2023లో జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య సాధారణం కంటే 0.37 డిగ్రీల పెరుగుదల నమోదు కాగా, ఈ ఏడాది జనవరిలో అది 0.94 డిగ్రీల వరకు పెరిగింది.
గతంలో 1958లో 1.17 డిగ్రీలు, 1990లో 0.97 డిగ్రీలు పెరిగిన తరువాత, 2024లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడం గమనార్హం.
Details
'లానినా' ప్రభావం తగ్గడం
వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై స్పష్టంగా కనిపిస్తోంది. లానినా బలహీనపడటంతో శీతాకాలంలో చలి తీవ్రత అంతగా అనుభూతి కాలేదు.
వాతావరణ నిపుణుల ప్రకారం రాబోయే వారాల్లో తూర్పు, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి పెరిగే సూచనలున్నాయి.
ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంతో పాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మినహాయించి మిగిలిన చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కేరళలో జనవరి నుంచే సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Details
ఆదోనిలో 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గరిష్ట, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. రెండు రోజులుగా ఉక్కపోత పెరుగుతూ వస్తోంది.
కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శుక్రవారం తుని, నందిగామ, గన్నవరం, నంద్యాల, కడప వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగాయి.
కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ కేజే రమేశ్ అభిప్రాయపడ్డారు.