భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.
విద్యార్థులకు అందించే F-1 వీసాల కోసం అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేసినట్లు పేర్కొంది.
ప్రస్తుతం స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్‌లను జూలై మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు విడుదల చేసినట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది.
విద్యార్థులు తమ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవడానికి ustraveldocs.comని సందర్శించవచ్చుని యూఎస్ ఎంబసీ ఇండియా ట్వీట్ చేసింది.
భారతదేశంలోని యూఎస్ దౌత్య మిషన్ ఇటీవల దేశవ్యాప్తంగా తన వార్షిక విద్యార్థి వీసా దినోత్సవాన్ని దిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులెట్లలో నిర్వహించింది.
ఆరోజున 3,500 మంది భారతీయ విద్యార్థి వీసా దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసినట్లు ఎంబసీ చెప్పింది.
వీసా
అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 20శాతం భారతీయులే
గతేడాది రికార్డు స్థాయిలో 125,000 మంది భారతీయులకు యూఎస్ విద్యార్థి వీసాలు జారీ మంజూరయ్యాయి. ఇది ఇతర దేశాల విద్యార్థుల కంటే చాలా ఎక్కువ.
గత సంవత్సరం ప్రతి ఐదు విద్యార్థి వీసాల్లో ఒకటి ఇండియా నుంచే ఉన్నట్లు భారతదేశంలోని కాన్సులర్ వ్యవహారాల తాత్కాలిక మంత్రి సలహాదారు బ్రెండన్ ముల్లార్కీ చెప్పారు.
ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తామని ఆయన వెల్లడించారు.
యూఎస్ ఎంబసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది 2లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు 20శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు.