Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం మూడు పార్టీల పోటీ.. నేడే తుది నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై చర్చలు వేడెక్కాయి.
మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతుండగా, తుది తీర్మానంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరోసారి సీఎం పదవి చేపట్టాలని ఆశిస్తున్నారని సమాచారం.
మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఈ పీఠంపై కన్నేశారు.
అయితే బీజేపీ వర్గాలు మాత్రం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దిశగా ఉన్నాయి.
Details
ముంబై వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకారం
ఈ ఉదయమే మహాయుతి ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది.
మహాయుతి నేతలు తమ నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డుకు నివేదించి, తుది పేరును ప్రకటిస్తారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావంకులే పేర్కొన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అత్యవసరంగా మారింది.
నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరగొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
దీనికి మూడు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.
Details
మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర
దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం పదవికి ప్రతిపాదించడంపై మరాఠా సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రలో జనాభాలో 30 శాతం ఉన్న మరాఠాలు ఇప్పటివరకు 13 మంది సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో మరాఠా వర్గానికి చెందిన నేతనే సీఎంగా చేయాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తోంది.
ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారుగా, మరాఠా వర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇమేజ్ ఆయనకు ప్రతికూలమవుతోంది.
రాజకీయంగా సంక్లిష్టమైన ఈ సమీకరణల మధ్య, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.