Tirumala: తిరుమలలో నీటి కష్టాలు.. మరో 90 రోజులకు మాత్రమే జలాశయాల్లో నిల్వలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ఈ పరిస్థితి తిరుమలలో నీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వాటర్ వర్క్స్ విభాగం అప్రమత్తమైంది. లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు వస్తుండటంతో నీటి వినియోగం, సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో సెలవు రోజుల్లోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. అయితే ఇటీవల పనిదినాలతో సంబంధం లేకుండా భారీ సంఖ్యలో భక్తులు కొండకు చేరుకుంటున్నారు. దీంతో నీటి వినియోగం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది.
వివరాలు
నిత్యం 60 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం
తిరుమల కొండపై ఉన్న 7,500 అద్దె గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు, మరుగుదొడ్లు, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ సుమారు 60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.
ఇందులో పాపవినాశనం డ్యామ్ నుంచి 15 లక్షల గ్యాలన్లు, గోగర్భం డ్యామ్ నుంచి మరో 15 లక్షల గ్యాలన్లు, తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి 30 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్ ద్వారా తిరుమలకు తరలిస్తున్నారు.
కొండపై ఉన్న పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్‌లతోపాటు కుమారధార, పసుపుధార డ్యామ్‌ల నుంచి కూడా నీటి సరఫరా జరుగుతోంది.
అయితే ప్రస్తుతం కుమారధార, పసుపుధార డ్యామ్‌లలో నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోయింది.
వివరాలు
మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం
పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌లలో మాత్రమే కొంతమేర నీటి నిల్వలు మిగిలి ఉన్నాయి.
ఈ నీరు మరో 90 రోజులకు మాత్రమే సరిపోతుందని తితిదే వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
మరో వారం రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందినట్లు ఓ అధికారి వెల్లడించారు.
సాధారణంగా తిరుమలలో ఏడాది చివరి నెలల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు.
రానున్న రోజుల్లో వర్షాలు కురిసి జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.