Tamil Nadu: చెన్నైలో కుండపోత వర్షాలు.. నీటమునిగిన రహదారులు, విమాన సేవలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధాని చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. దీంతో సబ్‌వేలు, నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటమునిగి జనజీవనం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్యారిస్‌లో అత్యధికంగా 36 సెం.మీ వర్షపాతం నమోదైంది. వేళచ్చేరి ఏజీఎస్ కాలనీలో రహదారులపై నీరు నిలవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కార్పొరేషన్ సిబ్బంది నీటిని తొలగించారు. ఆలందూర్‌లో వాననీటితో పాటు మురుగునీరు ఇళ్లను చుట్టుముట్టగా, నుంగంబాక్కంలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణం చెరువును తలపించింది.
వివరాలు
ఒక్కరోజే 400-450 మి.మీ వర్షం
వర్షపాతం వివరాలు పరిశీలిస్తే.. కత్తివాక్కంలో 34, చెన్నై సెంట్రల్‌లో 27, సాత్తాంకాడులో 26, తిరువొట్రియూర్, ఎన్నూర్‌లో 22, ఎంజీఆర్ నగర్‌లో 19, సీడీ ఆస్పత్రి తండయార్‌పేట, పెరంబూర్‌లో 18, తండయార్‌పేటలో 17, వడపళని, చెన్నై కలెక్టరేట్‌లో 16 సెం.మీ వర్షం కురిసింది.
బేసిన్‌బ్రిడ్జ్, నుంగంబాక్కం, వైఎంసీఏ నందనం, ఆలందూర్‌లో 15 సెం.మీ నమోదైంది.
ఐస్‌హౌస్, అన్నా వర్సిటీ, సెమ్మేడు (విళుపురం)లో 14 సెం.మీ, పలు ఇతర ప్రాంతాల్లో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తమిళనాడు వెదర్‌మ్యాన్ ప్రదీప్ జాన్ 'ఎక్స్'లో స్పందిస్తూ.. 2023 డిసెంబరులో మిగ్‌జామ్ తుపాను సమయంలో ఒక్కరోజే 400-450 మి.మీ వర్షం కురిసిందని, ఆ తర్వాత చెన్నైలో నమోదైన అతి భారీ వర్షం ఇదేనని పేర్కొన్నారు.
వివరాలు
సహాయక చర్యల కోసం అంతా సిద్ధం
సహాయక చర్యల కోసం 980 మంది అగ్నిమాపక సిబ్బంది, 83 అగ్నిమాపక వాహనాలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు.
రిప్పన్ బిల్డింగ్‌లో మంత్రి ఆదవ్ అర్జున, కమిషనర్ సమీరన్ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో సమీక్షించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలు 1913 నంబరుకు ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి తెలిపారు.
బాధితులకు ఆహారం అందించేందుకు ఆరు శిబిరాలను ఏర్పాటు చేశామని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 జోన్లను ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
వర్షం తగ్గేవరకు ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు.
వివరాలు
విమాన సేవలకు అంతరాయం
ఆదివారం ఉదయం నాటికి 273 ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించామని కమిషనర్ సమీరన్ తెలిపారు.
తొమ్మిది చోట్ల కూలిన చెట్లను తొలగించామని, పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినప్పటికీ ఎవరూ అక్కడికి రాలేదన్నారు.
నీటిని త్వరగా తొలగించడమే ఇందుకు కారణమని వివరించారు. ఉదయం 13,500 మందికి అల్పాహారం అందించినట్లు చెప్పారు.
భారీ వర్షాలతో చెన్నై విమానాశ్రయంలో సేవలకు అంతరాయం ఏర్పడింది.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 10కి పైగా దేశీయ విమానాలు ల్యాండింగ్ కోసం ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.
కోల్‌కతా నుంచి 184 మంది ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం చెన్నైలో దిగలేక హైదరాబాద్‌కు మళ్లింది.
వర్షం తగ్గిన తర్వాత విమానాలు ఒక్కొక్కటిగా చెన్నైలో దిగాయి.