LOADING...
Bobilli: టమాటా రైతులకు కష్టకాలం.. ఎకరాకు 20 టన్నులు.. కానీ లాభం శూన్యం
టమాటా రైతులకు కష్టకాలం.. ఎకరాకు 20 టన్నులు.. కానీ లాభం శూన్యం

Bobilli: టమాటా రైతులకు కష్టకాలం.. ఎకరాకు 20 టన్నులు.. కానీ లాభం శూన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

టమాటా రైతుల పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. కిలో టమాటాను రూ.2కే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కొనుగోలుదారులు కనిపించడంలేదు. గత నెలలో రూ.40 వరకు ధర ఉన్నా, అప్పటికి రైతుల చేతికి పంట రాలేదు. ఇప్పుడు పంట చేతికొచ్చేసరికి ధర పూర్తిగా కుప్పకూలింది. జిల్లాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న రామభద్రపురంలో టమాటా అమ్మకాల కోసం రైతులు పడుతున్న కష్టాలు చెప్పలేనివి. బొబ్బిలి పరిసరాల్లో సుమారు 80 ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. మార్కెట్‌కు తీసుకెళ్లినా రోజంతా వేచి చూసినా అమ్ముడవ్వని పరిస్థితి నెలకొంది.

వివరాలు 

ఎందుకిలా..

ఒకేసారి భారీగా దిగుబడి రావడంతో ధరలు క్షీణించాయని ఉద్యానశాఖ అధికారులు వివరిస్తున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో టమాటా నారు వేస్తారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎక్కువమంది రైతులు నవంబరులోనే ఒకేసారి నార్లు వేశారు. దాంతో ప్రస్తుతం పంట సమూహంగా మార్కెట్‌కు వస్తోంది. సాధారణంగా ఎకరాకు 13 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తారు. కానీ ఈసారి 18 నుంచి 20 టన్నుల వరకు పంట వచ్చింది. ఎక్కువ ఉత్పత్తి రావడం వల్లే ధరలు పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

నెల రోజుల్లో ఎంత తేడా

సాధారణంగా వేసవికాలంలో టమాటాకు మంచి ధర లభిస్తుంది. గత ఏడాది కిలో రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకాలు జరిగాయి. గత నెలలో కూడా రూ.40 వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ.2కు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఎకరా సాగుకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని, అయితే పంట అమ్మితే రూ.35 వేలైనా చేతికి రావడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ చెల్లించేందుకు కూడా డబ్బులు లేక చాలామంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేసే పరిస్థితి ఏర్పడింది.

Advertisement