'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ
'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఉద్ధవ్ ఠాక్రే తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. మంగళవారం దీనిపై విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై షిండే వర్గం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తోంది: ఠాక్రే
మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే గత సంవత్సరం ఠాక్రేపై తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఇరు వర్గాలు పార్టీ పేరు, చిహ్నం కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరును, 'విల్లు, బాణం'ను కేటాయించింది. భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం మాత్రం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎన్నికల సంఘం తొందరపాటుతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంట్‌గా పని చేస్తుందని మండిపడింది.