ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
భారత రాష్ట్ర సమితి రెండో బహిరంగ సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు. మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన నాయకులు బహిరంగ సభ సందర్భంగా బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారని నాయుకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలోనూ పార్టీ పట్టు సాధించడంలో సహాయపడవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్కు ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సురేఖ మద్దతు
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలను తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని గతంలో ధర్నాలు కూడా చేశారు. నాందేడ్ జిల్లాలోని నాగోన్, భోకర్, డెగ్లూర్, కిన్వాట్, హత్‌గావ్ ఎమ్మెల్యేలు 2019లో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమై తెలంగాణలో భాగం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. గతంలో ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని తీర్మానం చేసి కూడా ఆమోదించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షురాలు సురేఖ పాటిల్ హోట్టె ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి సమ్మతి పత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసి సరిహద్దుల గ్రామాల అండతో మహారాష్ట్రలో పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.