ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి తొలిసభను దిల్లీలోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో సభా వేదికను మార్చాలని నిర్ణయించారు. 2018 ఎన్నికల్లో పార్టీకి అతి తక్కువ స్థానాలు అందించిన ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి భారీ సభకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న ఈ సభ ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం ఖమ్మం టీఆర్ఎస్‌లో అనిశ్చితి నెలకొంది. పొంగులేటి పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత తుమ్మల కూడా అసంతృప్తిగా ఉండటంతో పాటు ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభ విజయవంతమైన నేపథ్యంలో జిల్లాలోని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ఖమ్మాన్ని కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీని వ్యతిరేకించే నాయకులకు ఆహ్వానం!
బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను జాతీయస్థాయిలో చర్చించుకునేలా భారీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సభకు పార్టీ శ్రేణులను భారీగా తరలించడంతో పాటు.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే జాతీయ నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారట. కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించిట్లు సమాచారం. ఈ సభకు జాతీయ నాయకులను ఆహ్వానించి.. విపక్షాల ఐక్యతను చాటాలనేది కేసీఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడంతో కేసీఆర్ ఖమ్మం సభను తొలి అడుగ్గా భావిస్తన్నట్లు సమాచారం.