Page Loader
ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం
ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం

ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం

వ్రాసిన వారు Stalin
Jan 24, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే నేతలను ఆహ్వానించనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు. అదే రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ కూడ నిర్వహించే అవకాశం ఉంది.

తెలంగాణ

గోపురాలు, ఇంటీరియర్ పనులు మాత్రమే పెండింగ్

వాస్తవాన్ని సచివాలయ భవనాన్ని సంక్రాంతి లేదా జనవరి నెలాఖరులోగా ప్రారంభించాలని కేసీఆర్ భావించారు. పనులు పూర్తి కాకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. గోపురాలతో పాటు కొన్ని బ్లాకుల్లో పనులు ఉన్నట్లు నిర్మాణ పురోగతిపై సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. 10రోజుల్లో గోపురం పనులు పూర్తిచేసి.. ఏడు అంతస్తుల భవనంలోని అన్ని బ్లాకుల్లో ఇంటీరియర్ పనులు చేపడతారు. పనులు పూర్తయిన వెంటనే భవనాన్ని ఆర్అండ్‌బీ శాఖ జీఏడీ విభాగానికి అప్పగిస్తుంది. మంత్రులు, కార్యదర్శులకు కేటాయించాల్సిన కార్యాలయ గదులను జీఏడీ అధికారులు ఖరారు చేస్తారు. వాహనాల పార్కింగ్‌ జోన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, అవి కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చని ఆర్‌అండ్‌బీ మంత్రి వీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.