Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. నిర్మాణ విస్తీర్ణం కనీసం 20 వేల చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్రతి కొత్త భవనానికి ఎనర్జీ సామర్థ్యానికి సంబంధించిన స్టార్ రేటింగ్ తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకురానుంది. ఈ రేటింగ్ ఎలా పొందాలి, దాన్ని ఎవరు జారీ చేస్తారు, దానికి సంబంధించిన విధివిధానాలు ఏమిటనే అంశాలతో కూడిన ముసాయిదా నిబంధనలను బుధవారం విడుదల చేసింది. భారీ భవనాలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలతో, పారదర్శకంగా అమలు అయ్యే జాతీయ స్టార్ రేటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
వివరాలు
ముసాయిదాలోని ముఖ్య నిబంధనలివే..
ఈ ప్రక్రియలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ)తో పాటు, ఆ సంస్థ వద్ద నమోదు చేసుకున్న గుర్తింపు పొందిన ఏజెన్సీలు కొత్త భవనాలను తనిఖీ చేసి స్టార్ రేటింగ్ కేటాయిస్తాయి. నిర్మాణ విస్తీర్ణం 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని కొత్త భవనాలకు స్టార్ రేటింగ్ తప్పనిసరిగా వర్తిస్తుంది. భారీ భవనాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో కూడిన జాతీయ స్టార్ రేటింగ్ వ్యవస్థను అమలు చేస్తారు. ఈ రేటింగ్ ద్వారా భవనం విద్యుత్ వినియోగ సామర్థ్యంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్మాణం ప్రారంభించే కొత్త భవనాలకే ఈ నిబంధనలు వర్తిస్తాయి.
వివరాలు
మరికొన్ని నిబంధనలు ఇవే..
స్టార్ రేటింగ్ నమోదు కోసం దరఖాస్తు రుసుము నివాస భవనాలకు రూ.50,000, ఇతర భవనాలకు రూ.1,00,000గా నిర్ణయించారు. మొత్తం మూడు రకాల స్టార్ రేటింగ్‌లు అందుబాటులో ఉంటాయి. అవి 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్. వీటిని ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్ (ECSBC) ప్రమాణాల ఆధారంగా కేటాయిస్తారు. ప్రతి కొత్త భవనం కనీసం 3 స్టార్ రేటింగ్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. 5 స్టార్ రేటింగ్‌కు 'సూపర్ ECSBC', 4 స్టార్కు 'ECSBC ప్లస్', 3 స్టార్కు 'ECSBC' అనే గుర్తింపుతో రేటింగ్ జారీ చేస్తారు.