Loading...
Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం
అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం

Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. వరుసగా రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రికి రాత్రే కొనుగోలు కేంద్రాలకు పరుగులు పెట్టి ధాన్యం కుప్పలు,సంచులను కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు జిల్లాల్లో ధాన్యం కల్లాలు చెరువులను తలపించగా, కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచిపోవడంతో భారీ నష్టం సంభవించింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ సహా అనేక జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. సరిపడా తార్పాలిన్లు లేకపోవడం, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాలు 

తడిసిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం మరలలకు తరలించే ఏర్పాట్లు

తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినప్పటికీ, స్థానిక కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పలుచోట్ల రైతులు నిరసనలకు దిగారు.

కొన్ని ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యం మరలలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

అయితే ముందుగానే తూకం వేసి మరలలకు పంపించి ఉంటే ఇంత నష్టం జరిగేదే కాదని రైతులు వాపోయారు.

మహబూబ్‌నగర్,వనపర్తి,నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడ్లు,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో వర్షం రైతులను మరింత ఆందోళనకు గురి చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో సగటున 56.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దేవరకద్ర మండలంలో అత్యధికంగా 139.6మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 600 టన్నులకుపైగా ధాన్యం తడవడంతో అధికారులు వాటిని ఉప్పుడు బియ్యం మరలలకు తరలించారు.

వివరాలు 

పిడుగుపాటుకు ఓ కోడె ఎద్దు మృతి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

జిల్లా సరఫరా అధికారి కాశీవిశ్వనాథ్ కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

దామెరగిద్ద ప్రాంతంలో పిడుగుపాటుకు ఓ కోడె ఎద్దు మృతి చెందింది.

యాదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, వలిగొండ, సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి మండలాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో కురిసిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

లారీల కోసం పదిహేను రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు తాజా వర్షం మరింత దెబ్బతీసింది. వెయ్యి క్వింటాళ్లకు పైగా ధాన్యం సంచులు తడిసిపోయాయి.

ADVERTISEMENT

వివరాలు 

రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టిన రైతులు 

నాగులపల్లిలో లోతట్టు ప్రాంతంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం సేకరణలో ఆలస్యం జరిగిందంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్కెట్ యార్డులు వరదనీటితో నిండిపోయాయి.

ధాన్యం, మొక్కజొన్న కుప్పల చుట్టూ నీరు చేరడంతో రైతులు డబ్బాలు, బకెట్లతో నీటిని తొలగించే ప్రయత్నం చేశారు.

సమయానికి పంట కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మెట్‌పల్లి, రామడుగు, కోరుట్ల, చొప్పదండి మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం వర్షానికి తడిసిపోయింది.

కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ చందుర్తి మండలం మల్యాల గ్రామ రైతులు కోరుట్ల రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ADVERTISEMENT