Amit Jogi Convicted Ramavatar Jaggi Murder : 23 ఏళ్ల తర్వాత తీర్పు.. మాజీ సీఎం కుమారుడికి శిక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌సీపీ నేత రామావతార్ జగ్గీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమిత్ జోగిను దోషిగా తేలుస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 23 సంవత్సరాల క్రితం, 2003లో జరిగిన ఈ హత్య కేసులో తాజాగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. తన తండ్రి స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) అధ్యక్షుడిగా ఉన్న అమిత్ జోగిని 2007లో ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది.
వివరాలు
వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే దోషిగా తేల్చారు
సీబీఐ అప్పీల్‌లో ఆలస్యం జరిగినప్పటికీ, ప్రత్యర్థి నేత హత్యకు కుట్ర ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో వ్యాఖ్యానించింది. గురువారం ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మల ధర్మాసనం.. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ అమిత్ జోగిని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కౌన్సెల్ వైభవ్ ఎ. గోవర్ధన్ వివరాలను వెల్లడించారు. ఈ తీర్పుపై స్పందించిన అమిత్ జోగి, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. గతంలో నిర్దోషిగా తేలిన తనను, సరైన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే దోషిగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
మరో అవకాశం ఇవ్వలేదు
తాను న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంచుతున్నానని, చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గౌరవ హైకోర్టు నా వాదన వినకుండానే కేవలం 40 నిమిషాల్లో సీబీఐ అప్పీల్‌ను అంగీకరించింది. ఒకసారి నిర్దోషిగా ప్రకటించిన వ్యక్తిని మరో అవకాశం ఇవ్వకుండానే దోషిగా తేల్చడం బాధాకరం. కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం లొంగిపోతాను. న్యాయవ్యవస్థపై నాకున్న నమ్మకం అటు అలాగే ఉంది. సుప్రీంకోర్టు నుంచి న్యాయం లభిస్తుందని విశ్వసిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.