Vijayasai Reddy: 'సాయన్న పేరులోనే సాయముందిరా!'.. పార్టీ ప్రకటనకు ముందు సన్నాహక గీతం విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు వేశారు. పార్టీ పేరును ప్రకటించకముందే తన భావజాలాన్ని, లక్ష్యాలను ప్రజలకు చేరవేసేలా రూపొందించిన సన్నాహక గీతాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "సాయన్న పేరులోనే సాయముందిరా..విజయసాయిరెడ్డి అన్న అడుగులోనే విజయముందిరా!" అంటూ సాగే ఈ పాట రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ పేరును నవంబర్ 11న ప్రకటించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రకటనకు కొద్దిరోజుల ముందే సన్నాహక గీతాన్ని విడుదల చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో అనుచరులు,కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ పాటను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి
ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా,కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానం అనూహ్య మలుపులు తిరిగింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు,నాయకత్వానికి క్రమంగా దూరమవుతూ వచ్చారు.
ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి రాజకీయంగా సంచలనం సృష్టించారు.
వైసీపీకి దూరమైన తర్వాత విజయసాయిరెడ్డి ఏదైనా జాతీయ పార్టీలో చేరతారని,లేదంటే మరో ప్రాంతీయ పార్టీలో కీలక బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది.
అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఆయన సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్
సాయన్న పేరులోనే సాయముందిరా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2026
విజయ సాయి రెడ్డి అన్న అడుగు లోనే విజయముందిరా! pic.twitter.com/v6CokobG8E