Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ దీర్ఘ సమావేశంలో పాలనా విధానాలు, పరిపాలనా సామర్థ్యం,2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతుందన్న అంశంపైనా లోతైన సమీక్ష నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు 'సేవా తీర్థ్' వేదికగా ప్రారంభమైన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర బాధ్యతల మంత్రులు,సహాయ మంత్రులు హాజరయ్యారు. ఈ ఏడాదిలో పూర్తి స్థాయి కేంద్ర మంత్రిమండలి సమావేశం ఇదే తొలిసారి కావడం విశేషం.
వివరాలు
కీలక నివేదికలు అందించిన కేబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్
వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల దశకు చేరుకుంటున్న సమయంలో నిర్వహించిన ఈ భేటీ ప్రభుత్వ పనితీరుపై మధ్యంతర సమీక్షలా సాగింది. సమావేశంలో తొమ్మిదికిపైగా మంత్రిత్వ శాఖలు తమ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర వివరాలు సమర్పించాయి. కేబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ కూడా కీలక నివేదికలు అందించాయి. ఫైళ్ల పరిష్కారంలో వేగం చూపుతూ నిర్ణయాలను సమయానికి అమలు చేస్తున్న శాఖలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
వివరాలు
ఐదు దేశాల పర్యటన ద్వారా భారత్‌కు లభించిన దౌత్య,వాణిజ్య ప్రయోజనాలు
విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ఐదు దేశాల పర్యటన వివరాలను మంత్రిమండలికి తెలియజేశారు. ఆ పర్యటనల ద్వారా భారత్‌కు లభించిన దౌత్య,వాణిజ్య ప్రయోజనాలను వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధనం,వ్యవసాయం,ఎరువులు,విమానయానం, నౌకాశ్రయం,సరకు రవాణా రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. సామాన్యప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మోదీ అన్ని శాఖలకు సూచించినట్లు సమాచారం. పశ్చిమాసియా పరిస్థితులపై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి మంత్రుల బృందం పర్యవేక్షణ కొనసాగిస్తోంది. అయితే ఆయన దక్షిణ కొరియా పర్యటనలో ఉండటం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారు. అలాగే ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉండటంతో ఈ సమావేశానికి దూరమయ్యారు.
వివరాలు
భారతదేశంలో ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అబుదాబి
ఐదు దేశాల పర్యటనను ముగించుకుని అదే రోజు ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి సమావేశంలో మంత్రులు ఘన స్వాగతం పలికారు. విదేశీ పర్యటన విజయవంతం కావడంతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించినందుకు ఆయనను అభినందించారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్య విస్తరణ, కీలక ఖనిజాల సరఫరా లక్ష్యంగా మోదీ యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించారు. యూఏఈ పర్యటనలో వ్యూహాత్మక చమురు నిల్వలు, దీర్ఘకాలిక వంటగ్యాస్ సరఫరా, రక్షణ, నౌకాశ్రయం రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలు కుదిరాయి. అదనంగా భారతదేశంలో ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అబుదాబి అంగీకరించింది.
వివరాలు
నెదర్లాండ్స్‌తో భారత్ 17 కీలక ఒప్పందాలపై సంతకాలు
పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐరోపా పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌తో భారత్ 17 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన స్థిరత్వం, పశ్చిమాసియా పరిస్థితులపై అక్కడ కూడా చర్చలు జరిగాయి. స్వీడన్, నార్వే దేశాలతో శుభ్రమైన ఇంధనం, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, డిజిటల్ సాంకేతికత, కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. 'ఇండియా-నార్డిక్ సదస్సు' వేదికగా విస్తృత చర్చలు నిర్వహించారు.
వివరాలు
'వికసిత్ భారత్ 2047'పై మోదీ దిశానిర్దేశం
పర్యటన చివరి దశలో ఇటలీ చేరుకున్న మోదీ అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. అనంతరం భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రకటించారు. ఈ మొత్తం అనుభవాల నేపథ్యంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రతి మంత్రి బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేసినట్లు సమావేశ వర్గాలు వెల్లడించాయి.