స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం
విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యారు. తనపై రెండేళ్ల నుంచి స్వామీజీ అత్యాచారానికి పాల్పడుతున్నారని రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల అనాథ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అర్ధరాత్రి స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయిన బాధిత బాలికను బంధువులు చేరదీశారు. ఈ క్రమంలో ఆమెను ఐదో తరగతి వరకు చదివించి చేతులు దలుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలికను విశాఖలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో బంధువులు రెండేళ్ల క్రితం చేర్పించారు. అక్కడ ఆమెకు ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం వంటి పనులను అప్పచెప్పేవారని బాలిక పిర్యాదులో వెల్లడించింది.
రైళ్లో తోటి ప్రయాణికురాలి సహాయంతోనే ఫిర్యాదు
ఇక రాత్రి కాగానే స్వామిజీ తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని లేఖలో పేర్కొంది. గత ఏడాది కాలంగా స్వామిజీ తన గదిలోనే గొలుసులతో బంధించేవారని, ఎదురు తిరిగితే కొట్టేవారన్నారు. తనకు కేవలం రెండు చెంచాల అన్నం మాత్రమే పెట్టేవారని, కాల కృత్యాలకు సైతం సరిగ్గా పంపించేవారు కాదన్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే స్నానానికి అనుమతిచ్చేవారని బాలిక ఫిర్యాదులో స్పష్టం చేశారు. అయితే ఈ నెల 13న పనిమనిషి సాయంతో ఎలాగోలా ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కేసింది. రైలులో తనకు పరిచయమైన తోటి ప్రయాణికురాలికి తన ఆవేదనను వివరించింది.
తాను అనుభవించిన నరకాన్ని బాలల సంక్షేమ కమిటీకి వివరించిన బాలిక
స్పందించిన సదరు మహిళ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది. ఈ క్రమంలో 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ వసతిగృహంలో జాయిన్ చేసేందుకు కృషి చేసింది. కానీ తమకు పోలీసుల నుంచి లెటర్ కావాలని, అప్పుడే చేర్చుకుంటామని హాస్టల్ నిర్వహకులు తేల్చిచెప్పారు. దీంతో కంకిపాడు ఠాణాకు వెళ్లిన బాలిక, ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లేఖను పొందింది. అనంతరం బాలిక అక్కడి నుంచి బాలల సంక్షేమ కమిటీకి వెళ్లింది. ఆశ్రమంలో తనపై జరిగిన అరాచకాల గురించి వివరించింది. దీంతో స్వామీజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలికతో కలిసి కమిటీ ప్రతినిధులు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
భూముల కోసమే నాపై కుట్ర చేస్తున్నారు : స్వామీజీ
బాలిక ఫిర్యాదు మేరకు స్వామీజీపై విజయవాడ పోలీసులు పోక్సో కేసును నమోదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు స్వామీజీని అర్ధరాత్రి విశాఖలో అరెస్ట్ చేశారు. మరోవైపు బాలిక చేసిన ఆరోపణలను పూర్ణానంద స్వామీజీ ఖండించారు. ఆశ్రమానికి సంబంధించిన భూములను కొల్లగొట్టేందురు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తనపై కుట్రతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై తాను న్యాయపోరాటం చేయనున్నట్లు స్వామీజీ వెల్లడించారు. అయితే ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైన విషయంపై ఈ నెల 15నే ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.