సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది. 67 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రికార్డు సృష్టించినట్లు వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 10రోజులకు ముందే 66.92 మిలియన్ టన్నులకు పైగా లోడ్ చేసినట్లు భారతీయ రైల్వే చెప్పింది.
అవాంతరాలు ఎదురైనా నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాం: డివిజనల్ కమర్షియల్ మేనేజర్
వ్యాగన్‌ల కొరత, ప్రకృతి వైపరీత్యాలు, కొత్త డబుల్‌లైన్ పనులకు సంబంధించి సేఫ్టీ పనులకు తరచూ బ్లాక్‌లు, కీలకమైన కొత్తవలస-కిరండూల్ లైన్ టెరిటరీలో అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఈ విజయం సాధించామని ఏకే త్రిపాఠి చెప్పారు. డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి అత్యుత్తమ లోడింగ్‌ను నమోదు చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా డివిజన్ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి ఆకాంక్షించారు.