Ganga River: గంగాలో నీటి నాణ్యత మెరుగుదల.. కాలుష్యం తగ్గుముఖం
ఈ వార్తాకథనం ఏంటి
గంగానదిలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని పర్యవేక్షణ కేంద్రాల వద్ద నీరు స్నానానికి అనుకూల స్థాయిలో ఉందని వెల్లడించింది. గంగానదిలో పీహెచ్ విలువలు, కరిగిన ఆక్సిజన్ స్థాయులు స్నానానికి అవసరమైన ప్రమాణాలకు సరిపోతున్నాయని జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గురువారం లోక్‌సభలో తెలిపారు. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు సేకరించిన నీటి నాణ్యత డేటాను ఆధారంగా చేసుకుని ఈ వివరాలు వెల్లడించినట్లు చెప్పారు.
వివరాలు
నీటి నాణ్యత మెరుగుపడలేదు
గంగానది ప్రవహిస్తున్న ఐదు ప్రధాన రాష్ట్రాలు—ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 112 ప్రదేశాల్లో నీటి నాణ్యతను పరీక్షించినట్లు తెలిపారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి నాణ్యత పూర్తిగా మెరుగుపడలేదని వెల్లడించారు. ముఖ్యంగా ఫరూఖాబాద్ నుంచి కాన్పూర్‌లోని పాత రాజ్‌పూర్ వరకు, రాయ్‌బరేలీలోని దల్మౌ, మీర్జాపూర్ దిగువ ప్రాంతం నుంచి గాజీపూర్‌లోని తరిఘాట్ వరకు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి అంతగా అనుకూలంగా లేదని చెప్పారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాత్రం నీటి నాణ్యత సంతృప్తికరంగా ఉందని స్పష్టం చేశారు. నమామి గంగే కార్యక్రమం కార్యక్రమం కింద గంగానది మరియు దాని ఉపనదుల్లో కాలుష్య నిర్మూలన, నీటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.