PM Modi: దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. బాధితుల ధైర్యానికి మోదీ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ విభజన కారణంగా ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విభజన సమయంలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న బాధితుల ధైర్యం, పట్టుదలను ఆయన కొనియాడారు. ఎన్నో కుటుంబాలు విడిపోయి, ప్రియమైన వారిని కోల్పోయినా.. బాధితులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు దేశ విభజన విషాదాన్ని గుర్తుచేసుకుంటూ భారత ప్రభుత్వం 'పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే'ను నిర్వహిస్తోంది. 1947లో దేశ విభజన, ఆ తర్వాత జరిగిన సామూహిక వలసలు, అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి ఈ రోజును పాటిస్తోంది.
వివరాలు
వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తి
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ విభజన ఎన్నో కుటుంబాలను చెల్లాచెదురు చేసిందన్నారు.
విభజన గాయాలను మోసిన బాధితులు తమ ప్రియమైన వారిని కోల్పోయి అంతులేని బాధను అనుభవించారని గుర్తుచేశారు.
భయానక పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వారు వెనుకడుగు వేయకుండా తమ జీవితాలను మళ్లీ నిర్మించుకున్నారని తెలిపారు.
విభజన బాధితులు ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకుని దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించారని ప్రధాని పేర్కొన్నారు.
వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. సామరస్యం, సోదరభావాన్ని కాపాడుకోవడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రజలంతా కలసికట్టుగా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.