Sawji Dholakia: సావ్జీ ఢోలాకియా ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ
గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీపావళి సమయంలో తన ఉద్యోగులకు భారీగా కానుకలు అందించే సావ్జీ, ఈ వారం జరిగిన తన కుమారుడి వివాహానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మోదీ చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు. ద్రవ్య, జాన్వి వివాహ బంధంలో ఒక్కటైన సందర్భంలో ప్రధాని మోదీ హాజరుకావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నామని సావ్జీ ఆ క్షణాలను షేర్ చేశారు. సావ్జీ ఢోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించారు. 4వ తరగతిలో చదువును మానేసి, తన మేనమామ వద్ద వజ్రాల పాలిషింగ్ నేర్చుకున్నారు.
శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో వజ్రాల ఎగుమతులు
1992లో ముంబయిలో 'శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్' పేరుతో వజ్రాల ఎగుమతులను ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా తన వ్యాపారాన్ని విస్తరించాడు. సావ్జీ ఢోలాకియా సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని తన ఉద్యోగులకు తిరిగి ఇవ్వాలని గట్టిగా నమ్ముతారు. అందువల్ల, ప్రతేడాది ఉద్యోగులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానుకలు అందిస్తుంటారు. 2011లో దీపావళి సందర్భంగా సిబ్బందికి ఖరీదైన బహుమతులతో పాటు బోనస్ అందించారు. 2015లో, 491 కార్లు, 200కు పైగా ఫ్లాట్లను సిబ్బందికి బహుమతిగా అందించారు. 2018లో 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించడం విశేషం ఇందులో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందించారు. ఈ బహుమతులను ప్రధాని మోదీ చేతులమీదుగా అందించడం సావ్జీ పేరు దేశమంతా మార్మోగింది.