
Amit Shah : జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..? 'హౌస్ అరెస్ట్' ఆరోపణలపై అమిత్ షా స్పందన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆరోగ్య సమస్యల కారణంగానే తాను పదవికి వైదొలిగానని ధన్‌ఖడ్ లేఖలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ప్రతిపక్షాలు దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాజీనామా తర్వాత ప్రజల్లో కనిపించకపోవడం, పలువురు రాజ్యసభ సభ్యులు కలవడానికి ప్రయత్నించినా విఫలమవ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఆయన్ని 'గృహ నిర్బంధం'లో పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఈ వాదనలను ఖండించారు. ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్‌ఐ (ANI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యల కారణంగానే ధన్‌ఖడ్ రాజీనామా చేశారు.
Details
ఊహాగానాలు అవసరం లేదు
ఆయన లేఖలో కారణాలను స్పష్టంగా తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పూర్తిగా బాధ్యతతో పని చేశారు. ఈ విషయంలో మరీ ఎక్కువ ఊహాగానాలు అవసరం లేదు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణలపై ఆధారపడి నిర్ణయాలకు రావడం సరికాదని స్పష్టం చేశారు. జూలై 21న ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వైద్యుల సలహాను పాటించేందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
Details
వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక
తన పదవీ కాలమంతా సహకరించిన రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అందరికీ ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ధన్‌ఖడ్ రాజీనామా నేపథ్యంలో, ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan)ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపగా, విపక్ష ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి (B. Sudershan Reddy)ని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే పార్లమెంటులో సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.