LOADING...
DGCA: విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని  DGCA ఎందుకు నిషేధించింది?
విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని DGCA ఎందుకు నిషేధించింది?

DGCA: విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని  DGCA ఎందుకు నిషేధించింది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలతో పనిచేసే పరికరాల విషయంలో ఇకపై కఠిన నియమాలు అమలు చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. విమాన ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పవర్ బ్యాంక్‌ల వల్ల చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత విమానయాన భద్రతా మార్గదర్శకాల ప్రకారం, పవర్ బ్యాంక్‌లను చెక్-ఇన్ బ్యాగేజీలో పెట్టేందుకు అనుమతి లేదు. అవి తప్పనిసరిగా క్యాబిన్ బ్యాగేజీలోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే,ప్రయాణ సమయంలో వాటిని ఉపయోగించి ఏ పరికరాన్నీ ఛార్జ్ చేయడానికి మాత్రం అనుమతించరు.

వివరాలు 

గత ఏడాది నవంబర్‌లోనే DGCA ఒక అడ్వైజరీ విడుదల

ఈ కొత్త పరిమితులను ప్రయాణికులకు తెలియజేసేందుకు విమానయాన సంస్థలు బోర్డింగ్ ప్రకటనలు, విమానంలో ఇచ్చే భద్రతా సూచనల ద్వారా అవగాహన కల్పించడం ప్రారంభించాయి. భవిష్యత్తులో అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని DGCA సూచించింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇదే అంశంపై గత ఏడాది నవంబర్‌లోనే DGCA ఒక అడ్వైజరీ విడుదల చేసింది. పవర్ బ్యాంకులు, స్పేర్ బ్యాటరీలను కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే అనుమతిస్తామని, వాటిని ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచకూడదని స్పష్టంగా పేర్కొంది. లిథియం బ్యాటరీల వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఎక్కువగా ఉండటం, అలాంటి పరిస్థితుల్లో వాటిని నియంత్రించడం కష్టమవుతుందనే కారణంతో ఈ ఆంక్షలు విధించినట్లు వివరించింది.

వివరాలు 

లిథియం బ్యాటరీలు కలిగిన పరికరాల వల్ల విమానాల్లో మంటలు

అధికశక్తి సామర్థ్యం కారణంగా లిథియం బ్యాటరీలు చాలా త్వరగా మంటలు అంటుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన మంట కూడా విమాన క్యాబిన్‌లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అత్యంత జాగ్రత్తలు అవసరమని విమాన భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పవర్ బ్యాంకులు,పోర్టబుల్ ఛార్జర్లు,లిథియం బ్యాటరీలు విమానాల్లో అగ్నిప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని DGCA స్పష్టం చేసింది. "రీచార్జ్ చేయగల పరికరాల్లో లిథియం బ్యాటరీల వినియోగం విస్తృతంగా పెరగడంతో,ప్రయాణికులు విమానాల్లో ఇలాంటి బ్యాటరీలను తీసుకెళ్లడం కూడా అధికమైంది. పవర్ బ్యాంకులు,పోర్టబుల్ ఛార్జర్లు,లిథియం బ్యాటరీలు కలిగిన పరికరాల వల్ల విమానాల్లో మంటలు సంభవించే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో అనేక అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి" అని DGCA తన సర్క్యులర్‌లో పేర్కొంది.

Advertisement