YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసింది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పిల్లలు మీ కళ్ల ముందే పెరిగారని, వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందంటూ షర్మిళ కన్నీరు పెట్టుకున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు ఆర్థికంగా లాభపడ్డారని షర్మిల అన్నారు. జగన్ పక్కన ఉంటూ ఆయనకు నమ్మకంగా పనిచేస్తున్నారని తెలిసినా సుబ్బారెడ్డి అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రశ్నించుకోవాలన్నారు. ఆస్తుల విషయంలో తనకు రావలసిన వాటా ఇవ్వకుండా సుబ్బారెడ్డి ఎలా మాట్లాడుతారంటూ షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి
తాను చెబుతున్నది నిజమని ప్రమాణం చేయగలను అని, అయితే సుబ్బారెడ్డి చెబుతున్నది కూడా నిజమని ఆయన ప్రమాణం చేయగలరా? అంటూ షర్మిళ ప్రశ్నించారు. నలుగురు మనవళ్లకు ఆస్తిలో సమాన వాటా అని రాజశేఖర్‌రెడ్డి బ్రతికుండగానే చెప్పారని, ఇది తన బిడ్డలమీద ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇది నిజం కాదని.. సుబ్బారెడ్డి, జగన్ ఇద్దరూ వారి బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ షర్మిళ ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్ తల్లిని కోర్టులోకి లాగడంపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ బలవంతంగా తన లాభం కోసం తల్లిని కోర్టులోకి లాగడమంటే ఎంత తప్పో వైసీపీ శ్రేణులు ఆలోచించుకోవాలని షర్మిళ అభిప్రాయపడ్డారు.