Loading...
Delhi Pollution Crackdown: ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా
ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా

Delhi Pollution Crackdown: ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న వింటర్ యాక్షన్ ప్లాన్‌లో తొలిరోజైన ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఒక్కరోజులోనే మొత్తం రూ.68.4 లక్షల జరిమానాలు విధించారు. అధికారిక వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు కలిసి సుమారు 15 వేల వాహనాలను తనిఖీ చేశారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీసీ) లేని 566 వాహనాలకు రూ.56.6 లక్షల జరిమానా విధించారు.

వివరాలు 

నిర్మాణ ప్రాంతాల్లోనూ తనిఖీలు

మరోవైపు, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,539 వాహనాలను వెనక్కి పంపించారు.

వీటి నుంచి రూ.2 లక్షల జరిమానా వసూలు చేశారు. బీఎస్-6 ప్రమాణాలు లేని ఇతర ప్రాంతాల వాహనాలను కూడా ఢిల్లీలోకి అనుమతించలేదు.

నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మొత్తం 300 నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేయగా.. 32 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.

ఆయా ప్రాంతాలకు పర్యావరణ నష్టపరిహారం కింద రూ.9.8 లక్షల జరిమానా విధించారు.

నిబంధనలు పాటించని కొన్ని నిర్మాణాలకు మూసివేత ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు అందజేశారు.

వివరాలు 

ఫిబ్రవరి 28 వరకు అమల్లో వింటర్ యాక్షన్ ప్లాన్

కాలుష్య నియంత్రణ చర్యలపై ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఈ వింటర్ యాక్షన్ ప్లాన్ ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ కాలంలో పార్కింగ్ ఫీజుల పెంపుతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వహించేలా నిబంధనలు అమలు చేయనున్నారు.

అయితే సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు, అత్యవసర సేవలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ADVERTISEMENT