
దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.
ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం తెల్లవారుజామున 207.18 మీటర్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి మట్టం భారీగా పెరగడం వరద ముప్పుకు సంకేతమని అధికారులు భావిస్తున్నారు. యమునా నది నీటి మట్టం పెరగడంతో ఐటీఓ ఛత్ ఘాట్ మునిగిపోయింది.
యమునా నది రికార్డు స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ చెబుతోంది.
నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో నిరంతర వర్షపాతం వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
దిల్లీ
పదేళ్ల తర్వాత రికార్డు స్థాయి నీటిమట్టం
యమునా నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశామని, ఇతర విభాగాలతో సంపద్రింపులు జరిపి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్లు ఉంటే, అది బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది.
2013లో నది నీటిమట్టం 207.32 మీటర్ల స్థాయికి చేరింది. ఆ తర్వాత ఎక్కువ నీటి మట్టం నమోదు కావడం ఇదే అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా, దిల్లీలో బుధవారం ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.