LOADING...
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు పాటించాల్సిన ప్రత్యేక సమయాలు ఇవే!
అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు పాటించాల్సిన ప్రత్యేక సమయాలు ఇవే!

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు పాటించాల్సిన ప్రత్యేక సమయాలు ఇవే!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున వస్తుంది. అయితే తృతీయ తిథి మరుసటి రోజు ఉదయం 7:40 వరకు కొనసాగుతుండటంతో, కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 20న కూడా ఈ పండుగను జరుపుకుంటారు. వైశాఖ మాస శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20 ఉదయం 7:40 వరకు ఉంటుంది. ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన దినంగా పరిగణిస్తారు. బంగారం కొనుగోలు చేయడం, వస్త్రాలు, ఆభరణాలు కొనడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలకు ఇది అత్యంత అనుకూలమైన రోజు.

వివరాలు

ఆరోజు ఇలా చేస్తే అన్నీ శుభాలే

తృతీయ తిథి కొనసాగుతున్నంత కాలం బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున బంగారం, వస్త్రాలు కొనడం, పూజలు చేయడం, దానాలు చేయడం వంటి కార్యాలన్నీ శాశ్వత ఫలితాలను ఇస్తాయని విశ్వాసం ఉంది. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతలే ఈ రోజును శుభదినంగా ఉపయోగించుకున్నారని, అనేక శుభకార్యాలు ఈ రోజున ప్రారంభమైనట్లు చెప్పబడింది. అక్షయ తృతీయకు సంబంధించిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున పరశురాముడు జన్మించాడని నమ్ముతారు. అలాగే పవిత్ర గంగా నది శివుడి జటాజూటం నుంచి భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే. పురాణాల ప్రకారం త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదేనని చెబుతారు. కుచేలుడు ద్వారకలో శ్రీకృష్ణుడిని కలిసిన రోజు కూడా ఇదే అని విశ్వసిస్తారు.

వివరాలు

కుబేరుడి రోజు.. ప్రత్యేకతలు ఇవే..

వినాయకుడి సహకారంతో వ్యాస మహర్షి మహాభారత రచనను ఈ రోజునే ప్రారంభించాడని చెబుతారు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్యదేవుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఇదేనని విశ్వాసం. అలాగే శివుని ఆజ్ఞతో కుబేరుడు మహాలక్ష్మీదేవితో కలిసి సంపదల అధిపతిగా నియమితుడైన రోజు కూడా ఇదే అని శివపురాణం పేర్కొంటుంది. మహాభారతం ప్రకారం దుశ్శాసనుడి నుంచి ద్రౌపదిని శ్రీకృష్ణుడు రక్షించిన రోజు కూడా ఇదే. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. అదేవిధంగా ఆది శంకరాచార్యులు కనకధారా స్తోత్రాన్ని ఈ రోజునే ప్రసంగించారని విశ్వసిస్తారు. నరసింహస్వామి ప్రహ్లాదుడికి అనుగ్రహం చేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

Advertisement

వివరాలు

ఇవి దానం చేస్తే చాలా మంచిది..

అక్షయ తృతీయ రోజున చేసే ప్రతి కార్యం ఫలితం చిరకాలం మనతోనే ఉంటుంది అని నమ్మకం ఉంది. అది మంచి పని అయినా, చెడు పని అయినా దాని ఫలితాలు జన్మజన్మాలపాటు వెంటాడుతాయని భావిస్తారు. ఈ రోజున జలదానం చేస్తే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజున చేసిన దానధర్మాలు ఎప్పటికీ వృథా కావు. అన్నదానం, వస్త్రదానం, బంగారం దానం, గోదానం వంటి సేవలు అపారమైన సంపదను ప్రసాదిస్తాయని నమ్మకం. అలాగే గొడుగులు, చెప్పులు, విసనకర్రలు, నీటితో నింపిన కుండలను దానం చేసినా శుభఫలితాలు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజు విజయాన్ని, అదృష్టాన్ని అందించే దినంగా చెప్పబడింది.

Advertisement

వివరాలు

శుభకార్యాలకు మంచి రోజు..

మత్స్యపురాణం ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం అత్యంత శ్రేయస్కరం. విష్ణువు పాదాలను అక్షతలతో పూజించి, ఆ అక్షతలను వస్త్రాలు, బంగారంతో కలిసి దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారని విశ్వసిస్తారు. వ్రతం, జపం, పూజ, దానం, హోమం వంటి ఏ ఆచరణ చేసినా పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని చెబుతారు. అక్షయ తృతీయ రోజున వివాహం జరిగితే ఆ దాంపత్యం చిరకాలం నిలిచి, సుఖశాంతులతో కొనసాగుతుందని విశ్వాసం ఉంది. ఈ రోజున రాహుకాలం, యమగండం, వర్జ్యం, దుర్ముహూర్తం వంటి అవాంతరాలు ప్రభావం చూపవని చెబుతారు. అందువల్ల ఏ శుభకార్యమైనా ఈ రోజున ఎప్పుడైనా ప్రారంభించవచ్చని మత్స్యపురాణం సూచిస్తుంది.

Advertisement