Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ప్రత్యేకం.. ఇలా చేస్తే సంపద, ఐశ్వర్యం మీ సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
వైశాఖ మాసం.. దీనిని సంస్కృతంలో 'మాధవ మాసం' అంటారు. ఈ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే తదియ తిథినే 'అక్షయ తృతీయ' (Akshaya Tritiya 2026)అని పిలుస్తారు. 'న క్షయః ఇతి అక్షయ' అంటే క్షయం లేనిది, నశించనిది, తరగనిది అని అర్థం. ఈ రోజు చేసే జప, తప, దాన, ధర్మాల వల్ల లభించే పుణ్యఫలం ఎప్పటికీ తరిగిపోదు. అందుకే దీనికి 'అక్షయ తృతీయ' అని పేరు. జ్యోతిషం, ధర్మశాస్త్రపరంగా, మన పెద్దలు అందించిన జ్ఞానం ప్రకారం.. అక్షయ తృతీయ విశిష్టత (Akshaya Tritiya Importance) ఏమిటో, ఈ రోజున మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం..!
వివరాలు
అరుదైన గ్రహస్థితి..
ఈ సంవత్సరం అక్షయ తృతీయకు జ్యోతిషపరంగా విశేష ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున ఆత్మకారకుడైన సూర్యుడు అగ్ని రాశి అయిన మేషంలో ఉచ్ఛస్థితిలో ఉండగా, మనః కారకుడైన చంద్రుడు భూ రాశి అయిన వృషభంలో కృత్తిక నక్షత్రం 3 పాదంలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. అలాగే, లక్ష్మీకారక గ్రహమైన శుక్రుడు భూ రాశి అయిన వృషభంలో స్వరాశిలో ఉన్నాడు. ఇలా సూర్య, చంద్ర, ఉచ్ఛ స్థితిలో శుక్ర గ్రహం స్వక్షేత్రంలో ఏకకాలంలో ఉండటం పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహానికి, ఐశ్వర్య వృద్ధికి సంకేతం. ఈ అద్భుతమైన కలయిక కేవలం వైశాఖ మాసంలో వచ్చే తదియ రోజు మాత్రమే సాధ్యమవుతుంది.
వివరాలు
కుదిరితే కొనొచ్చు.. లేదంటే..
అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది 'బంగారం కొనడమే'. ఈ తిథి నాడు సువర్ణాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా అక్షయంగా ఉంటుందనేది ఓ నమ్మకం. బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉత్తర భారతదేశంలో (ముఖ్యంగా జైనులలో, దంతేరాస్ సమయంలో) పుట్టి, క్రమంగా దక్షిణాదికీ పాకింది. అక్షయ తృతీయ రోజున మీ తాహతుకు తగినట్టుగా కొంచెం బంగారం కొనుక్కోవడం మంచిదే. అలాగని, విపరీతంగా అప్పులు చేసి మరీ కొనుక్కోవాలనే ధోరణి మంచిది కాదు. స్తోమత లేనివారు.. అయ్యో కొనలేకపోయామే అని చింతించకుండా, దానం వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఆచరించినా పుణ్యమే. ఏ జన్మలోనైనా సరే.. మనకు ఉపయోగపడేది మనం చేసే పుణ్యకార్యాలే!
వివరాలు
ఏం దానం చేయాలి?
శరీరం నిలబడాలన్నా, ప్రాణం నిలవాలన్నా అత్యంత ఆవశ్యకమైనది 'నీరు'. అందుకే ఈ వేసవి కాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు అత్యంత శ్రేష్టమైనది 'ఉదక భాండ దానం' (నీటి కుండ దానం). ఒక మట్టి కుండను శుభ్రంగా కడిగి, అందులో చల్లని మంచి నీరు పోసి.. అందులో కొద్దిగా యాలకులు, పచ్చ కర్పూరం, లవంగాలు వేసి సుగంధభరితమైన జలాన్ని తయారు చేయాలి. ఆ కుండను దానం చేయాలి. 'ఈ జల దానం వల్ల నా ఆకలిదప్పులు జన్మజన్మలకూ తీరాలి' అని సంకల్పం చేసుకోవాలి.
వివరాలు
విసనకర్రలు, చెప్పులు వంటివి దానం చేయాలి
దీంతో పాటు వేసవి తాపాన్ని తట్టుకొనేందుకు ఉపయోగపడే విసనకర్రలు, గొడుగు, చెప్పులు, చాపలు దానం చేయడం ద్వారా గొప్ప పుణ్య ఫలం పొందొచ్చు. అలాగే, ఆకలి తీర్చే స్వయంపాకం (బియ్యం, పప్పు, కూరగాయలు, చింతపండు తదితర వంటసామగ్రి) లేదా అన్నదానం చేయడం వల్ల వచ్చే జన్మల్లోనూ అన్నపానీయాలకు, వస్త్రాలకు లోటు ఉండదు. దంపతులు ఇద్దరూ కలిసి ఈ దానాలు చేయడం, ముత్తయిదువలకు పసుపు, కుంకుమ ఇవ్వడం వల్ల జన్మజన్మలకూ సువాసీనిత్వం ప్రాప్తిస్తుంది.
వివరాలు
నిర్ణయ సింధు - శాస్త్ర ప్రమాణం
నిర్ణయ సింధు, మత్స్య పురాణం, పద్మ పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ అనేది 'యుగాది' (ఒక యుగానికి ఆరంభ దినం). సూర్యసిద్ధాంతం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 20, 2026 సోమవారం శు.తదియ ఉ.10.28 వరకు ఉంది. కృత్తిక ఉ.7.22 వరకు ఉంది. రోహిణి తె.5.44 వరకు ఉంది.. అందువల్ల, అక్షయ తృతీయ ఏప్రిల్ 20న(Akshaya Tritiya Date)వచ్చింది. ''వైశాఖే శుక్ల పక్షేతు తృతీయా రోహిణీ యుతా...'' - వైశాఖ శుక్ల తదియ, రోహిణీ నక్షత్రం, సోమవారం/ బుధవారం కలిసొస్తే అది అత్యంత పుణ్యప్రదమైనది. స్మృత్యర్థసారం ప్రకారం.. ఇది పూర్వాహ్ణ వ్యాపినీ (ఉదయం పూట వ్యాపించి ఉన్న) తిథిగా గ్రహించాలి. రెండు రోజులు తదియ ఉంటే రెండో రోజునే పరిగణనలోకి తీసుకోవాలి.
వివరాలు
సింహాచలంలో చందనోత్సవం
అక్షయ తృతీయ అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తుకు వచ్చేది సింహాచల క్షేత్రం. సంవత్సరమంతా చందనం పూతతో ఉండే శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభించేది ఈ ఒక్క రోజే. స్వామివారికి గంధం ఒలిచి, సహస్ర ఘటాభిషేకం (వెయ్యి కుండలతో జలాభిషేకం) చేస్తారు. ఇది అత్యంత అరుదైన, అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం. లోకంలో పుణ్యం, పాపం రెండూ మనం అనుభవిస్తే ఖర్చయిపోతాయి. కానీ అక్షయ తృతీయ నాడు మనం చేసే దానధర్మాలు, ఈశ్వర స్మరణ అక్షయంగా మన జీవుడి ఖాతాలో జమై, ఏ జన్మలో ఉన్నా మనల్ని రక్షిస్తాయి. మన జీవితాల్లో లక్ష్మీ కటాక్షం దినదిన ప్రవర్ధమానమవుతూ, తరగని ఐశ్వర్యంతో, సత్కర్మాచరణతో అక్షయంగా ఉండాలని కోరుకుందాం.