Loading...
Ashwagandha: అశ్వగంధ దీర్ఘకాల వినియోగంపై కీలక అధ్యయనం.. లివర్‌, కిడ్నీలకు భద్రత
అశ్వగంధ దీర్ఘకాల వినియోగంపై కీలక అధ్యయనం.. లివర్‌, కిడ్నీలకు భద్రత

Ashwagandha: అశ్వగంధ దీర్ఘకాల వినియోగంపై కీలక అధ్యయనం.. లివర్‌, కిడ్నీలకు భద్రత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అశ్వగంధను 24 వారాల పాటు రోజువారీగా తీసుకున్న ఆరోగ్యవంతుల్లో కాలేయం, మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షల్లో పెద్దగా ప్రతికూల మార్పులు కనిపించలేదు. 1,200 మందిపై నిర్వహించిన ఈ బహుళ కేంద్రాల క్లినికల్‌ ట్రయల్‌ ఫలితాలు ఆగస్టు 20న 'ఫ్రాంటియర్స్‌ ఇన్‌ మెడిసిన్‌' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

వివరాలు 

1,200 మందిపై అధ్యయనం

కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న 18 నుంచి 70ఏళ్ల మధ్య వయసున్న 1,200మంది ఆరోగ్యవంతులను ఈ పరిశోధనలో చేర్చారు.

వీరికి టీకా ప్రాథమిక డోస్‌లో ఒకటి లేదా రెండు డోసులు,లేదంటే బూస్టర్‌ డోస్‌ తీసుకున్న తర్వాత అశ్వగంధను అందించారు.

పరిశోధనలో భాగంగా రోజూ 500మిల్లీగ్రాముల ప్రమాణీకరించిన అశ్వగంధ వేరు సారాన్ని ఒక వర్గానికి ఇవ్వగా.. మరో వర్గానికి దానిని పోలిన ప్లేసిబోను అందించారు.

ఈ పరిశోధనలో అశ్వగంధ వినియోగం ప్రారంభమైన తర్వాత 24వారాలపాటు ఔషధ ప్రభావాలను పరిశీలించారు.

మొత్తం అధ్యయనం 28 వారాలపాటు కొనసాగింది. చివరి నాలుగు వారాల్లో అశ్వగంధ లేదా ప్లేసిబో ఇవ్వకుండా ఫాలోఅప్‌ చేశారు.

దేశంలోని పలు కేంద్రాల్లో జరిగిన ఈ అధ్యయనంలో 1,032 మంది పాల్గొనేవారు పూర్తి ప్రక్రియను పూర్తిచేశారు.

వివరాలు 

లివర్‌, కిడ్నీ పరీక్షల్లో పెద్దగా మార్పులు లేవు

అశ్వగంధ తీసుకున్న వారిలో రక్త సంబంధిత పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, మూత్రపిండాల పనితీరు పరీక్షలు సాధారణ పరిధిలోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు అశ్వగంధతో సంబంధం ఉన్నవిగా గుర్తించలేదు.

నమోదైన దుష్ప్రభావాల్లో ఎక్కువగా స్వల్ప స్థాయి జీర్ణాశయ సంబంధ సమస్యలే ఉన్నాయి.

అవి సాధారణంగా స్వల్పంగా ఉండి తక్కువ సమయంలో తగ్గిపోయాయి.

అయితే అశ్వగంధ తీసుకున్నవారిలో సుమారు 2 శాతం మందికి కాలేయ ఎంజైమ్‌లలో సాధారణ పరిమితికి 1.5 రెట్లు వరకు స్వల్ప పెరుగుదల కనిపించింది.

ప్లేసిబో గ్రూపులో ఇది 0.7 శాతంగా నమోదైంది. అధ్యయనంలో నమోదైన ఎనిమిది తీవ్రమైన ప్రతికూల ఘటనలు పరిశోధనలో ఉపయోగించిన అశ్వగంధతో సంబంధం ఉన్నవిగా పరిగణించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

టీకా రోగనిరోధక శక్తిపై ప్రభావం?

అశ్వగంధ తీసుకోవడం వల్ల కొవిషీల్డ్‌ టీకా ద్వారా ఏర్పడిన రోగనిరోధక ప్రతిస్పందనకు స్పష్టమైన ఆటంకం కనిపించలేదని అధ్యయనం పేర్కొంది.

అశ్వగంధ, ప్లేసిబో తీసుకున్న రెండు గ్రూపుల్లోనూ వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీ ప్రతిస్పందన అధ్యయన కాలంలో కొనసాగింది.

అయితే అశ్వగంధ అదనంగా రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయాన్ని ఈ పరిశోధన స్పష్టంగా నిర్ధారించలేకపోయింది.

పరిశోధనలో టీకా తర్వాత ఏర్పడిన రోగనిరోధక ప్రతిస్పందన ఇప్పటికే బలంగా ఉండటంతో అశ్వగంధ అదనపు ప్రభావాన్ని గుర్తించడం కష్టమైందని పరిశోధకులు తెలిపారు.

అలాగే అధ్యయనం ప్రారంభంలోనే సుమారు 70 శాతం మందిలో గతంలో కరోనా వైరస్‌ సోకినట్లు సూచించే న్యూక్లియోక్యాప్సిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

24 వారాల వినియోగంపై భద్రత

పరిశోధకుల ప్రకారం.. రోజూ 500 మిల్లీగ్రాముల అశ్వగంధ వేరు సారం, సుమారు 4 గ్రాముల వేరు పొడికి సమానమైన మోతాదు.

నియంత్రిత వైద్య పరిస్థితుల్లో 24 వారాల పాటు ఈ మోతాదును ఉపయోగించినప్పుడు ఆరోగ్యవంతులైన అధ్యయన పాల్గొనేవారిలో అది బాగా సహించబడినట్లు ఫలితాలు సూచించాయి.

అయితే ఈ ఫలితాలను వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా వర్తింపజేయలేమని పరిశోధకులు స్పష్టం చేశారు.

వివరాలు 

మరిన్ని పరిశోధనలు అవసరం

ఈ అధ్యయనం ప్రధానంగా అశ్వగంధ దీర్ఘకాలిక వినియోగం, సహనశీలత, భద్రతపై దృష్టి పెట్టింది.

అశ్వగంధ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే సెల్యులార్‌ రోగనిరోధక ప్రతిస్పందనను ఇందులో పూర్తిగా పరిశీలించలేదు.

అందువల్ల అశ్వగంధ వల్ల కలిగే రోగనిరోధక ప్రయోజనాలను నిర్ధారించేందుకు మరిన్ని నియంత్రిత క్లినికల్‌ పరిశోధనలు అవసరమని అధ్యయనం తేల్చింది.

ADVERTISEMENT