Lord Vinayaka: రేపే వినాయక చవితి.. ఏ సమయంలో పూజిస్తే మంచిదో తెలుసా..?
గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించడం ప్రారంభమైంది. ఇప్పటికే వేల సంఖ్యలో గణనాథులు పూజలందుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. శనివారం ఉదయం తొలిపూజ జరగనుంది. లంబోదరుడిని ఏ సమయంలో ప్రతిష్టించాలో, పూజ సమయంలో నివారించాల్సిన తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6, 7 తేదీలలో జరగనుందని పురోహితులు సూచిస్తున్నారు.
శుభముహూర్తం
ధృక్ సిద్ధాంతం ప్రకారం, శనివారం (సెప్టెంబర్ 7) చవితి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తం ఉంది. సాయంత్రం 6:22 నుండి రాత్రి 7:30 గంటల మధ్య వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం పూజ చేయాలని చెప్పడం జరిగింది. ఈ సమయాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేయడం వల్ల అన్నీ శుభాలు జరగడం కచ్చితమని పురోహితులు పేర్కొంటున్నారు.
వస్త్రాలు,పూజా విధానాలు
గణనాథుడికి ఎరుపు రంగు వస్త్రాలు ఇష్టమట .. అందుకే వినాయక చవితి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. అయితే, ఈ ఏడాది చవితి శనివారానికి వస్తోంది కాబట్టి, శనేశ్వరుడికి ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించడం కూడా మంచిది అని చెబుతున్నారు. పూజలో భాగంగా, జిల్లేడు ఒత్తుల దీపం వెలిగించడం మంచిది. ప్రమిదలో కొబ్బరినూనె పోసి ఐదు జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగిస్తే వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు. అలాగే, పండగ నాడే 21 పత్రాలతో గణపతిని పూజించడం సాధ్యం కాకపోతే, గరిక పోచల జంటను వినాయకుడికి సమర్పించడంతో 21 ప్రతాలతో పూజించిన లాభం పొందవచ్చు.
విగ్రహం ఎంపిక
బొజ్జ గణపయ్యను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విగ్రహం కొనాలో ఇప్పుడు చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా, ప్రకృతికి దగ్గరగా ఉండే మట్టి గణపయ్యను తీసుకోవడం మంచిది. విగ్రహానికి కిరీటం ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతున్నారు. లేత గంధం రంగు గణపతి విగ్రహాన్ని పూజించడం ఉత్తమమని, ఎలుక విగ్రహంలో కలిసి ఉండాలని చెబుతున్నారు.
పూజ సమయంలో ఆచరణ
వినాయకుడి తొండం ఎప్పుడూ కుడివైపున ఉండకూడదు..ఎడమ వైపున ఉండాలి. కుడివైపున తొండం ఉన్న విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉండవచ్చని పూజారులు హెచ్చరిస్తున్నారు. పూజ సమయంలో మద్యం, మాంసం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదు. మనసును శాంతంగా ఉంచుకోవాలి. దేవుడిపై ఏకాగ్రత, భక్తిని నిలబెట్టాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం పొందవచ్చని చెప్పారు.