Loading...
Bathukamma Festival 2026: అక్టోబరు 10 నుంచి బతుకమ్మ సంబరం.. పూలతో కొలువుదీరే తెలంగాణ సంస్కృతి
అక్టోబరు 10 నుంచి బతుకమ్మ సంబరం.. పూలతో కొలువుదీరే తెలంగాణ సంస్కృతి

Bathukamma Festival 2026: అక్టోబరు 10 నుంచి బతుకమ్మ సంబరం.. పూలతో కొలువుదీరే తెలంగాణ సంస్కృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

పూలు ప్రకృతికి అందం, సౌందర్యాన్ని తీసుకొస్తాయి. వాటి పరిమళం పరిసరాలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే పుష్పాలను భగవంతుడి సంకల్పానికి ప్రతీకగా పురాణాలు అభివర్ణించాయి. పూలతో పూజలు చేయడం మన సంప్రదాయంలో భాగం. అయితే పూల సమూహాన్నే ప్రత్యక్ష శక్తి స్వరూపంగా భావించి బతుకమ్మగా ఆరాధించే ప్రత్యేక సంప్రదాయం తెలంగాణలో కొనసాగుతోంది. మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరిగే ఈ పూల పండుగ శరన్నవరాత్రులకు ప్రత్యేక శోభను తీసుకొస్తుంది.

వివరాలు 

మహాలయ అమావాస్య నుంచి మహానవమి వరకు వేడుకలు

'పుష్ప చింతామణి' ప్రకారం పువ్వు మూలంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, పుష్పాగ్రంలో మహేశ్వరుడు, తొడిమెలో సకల దేవతలు కొలువై ఉంటారు.

అలాంటి పూలను అందంగా పేర్చి బతుకమ్మగా రూపొందించి.. ఆటపాటలతో దేవీ శక్తిగా పూజించడం తెలంగాణ ప్రత్యేక సంస్కృతిలో ఒకటి.

దుర్గా త్రిశతి జగదీశ్వరిని 'కుసుమేశ్వరి', 'పుష్పవల్లి' వంటి పేర్లతో పేర్కొంది.ఈ భావాలకు ప్రతిరూపంగా బతుకమ్మను భావిస్తారు.

సకల జీవరాశులకు జీవశక్తిని అందించే ప్రకృతికి ప్రతీకగా బతుకమ్మను పూలతో అలంకరించి బంగారు కల్పవల్లిలా కొలువుదీరుస్తారు.

మహాలయ అమావాస్య నుంచి మహానవమి వరకు మహిళలు బతుకమ్మ చుట్టూ ఆటలు, పాటలతో వేడుకలు నిర్వహిస్తారు.

వివరాలు 

కూర్పులోనే ప్రత్యేకత

బతుకమ్మ గురించి పురాణాలు, ప్రాచీన కావ్యాల్లో స్పష్టమైన ప్రస్తావన కనిపించకపోయినా.. తెలంగాణ పల్లె ప్రజలు జానపద గీతాల ద్వారా ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చారు.

పూల జాతరగా,రంగుల హరివిల్లుగా, పాటల పల్లకిగా బతుకమ్మ సందడి చేస్తుంది.

పూల పరిమళాలు,మహిళల పాటలు,సామూహిక వేడుకలతో పండుగ వాతావరణం నెలకొంటుంది.

బతుకమ్మను తయారు చేసేందుకు ముందుగా ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులను పరుస్తారు.

వాటిపై కుంకుమ, పసుపు, పుట్టమన్ను, నవధాన్యాలను ఉంచుతారు.

సస్యకారక శక్తికి ప్రతీకగా బతుకమ్మను ఆహ్వానించి.. గునుగు, తంగేడు, రుద్రాక్ష, గోరింట, మందార, చేమంతి, బంతి వంటి పూలను వరుసగా, వృత్తాకారంలో అందంగా అమరుస్తారు.

పూలతో పేర్చిన బతుకమ్మపై గుమ్మడి పువ్వును ఉంచి, దానిపై తమలపాకులో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

కూర్పులోనే ప్రత్యేకత

ఇలా వివిధ రంగుల పుష్పాలతో అలంకరించిన పూల సమాహారమే బతుకమ్మగా రూపుదాల్చుతుంది.

బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు.

జానపద,ఇతిహాస,చారిత్రక అంశాలతో పాటు బతుకమ్మ ఆవిర్భావం,సామాజిక జీవన విధానం, కుటుంబ అనుబంధాలు వంటి అనేక విషయాలు ఈ పాటల్లో ప్రతిధ్వనిస్తాయి.

తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ ఆటపాటల వేడుకలో బతుకమ్మకు ప్రత్యేకమైన రూపకల్పన ఉంటుంది.

సాధారణంగా బతుకమ్మ తొమ్మిది వరుసలతో ఆకారం సంతరించుకుంటుంది.

తొమ్మిది సంఖ్యను పూర్ణత్వానికి ప్రతీకగా భావిస్తారు. నవదుర్గలు, నవవిధ భక్తి మార్గాలు, నవగ్రహాలు, నవావరణాలు, నవనిధులు, నవరాత్రులకు ఈ తొమ్మిది వరుసలను సంకేతంగా చెబుతారు.

ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమన్వయానికి బతుకమ్మ ప్రతీకగా భావిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

బతుకమ్మకు సంబంధించిన కథలు

దేవీ నవరాత్రుల్లో జరిగే శ్రీచక్రార్చనకు కూడా బతుకమ్మ వేడుకను ప్రతిరూపంగా పేర్కొంటారు.

మూడు, ఏడు, తొమ్మిది వరుసల్లో పూలను పేర్చే పద్ధతులు ఉన్నాయి.

మూడు వరుసలు త్రిశక్తులకు, ఏడు వరుసలు సప్తమాతృకలకు, తొమ్మిది వరుసలు నవదుర్గలకు సంకేతంగా భావిస్తారు.

బతుకమ్మ పండుగ వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.

మహిషాసురుడితో యుద్ధం చేసి అలసిపోయిన జగన్మాతకు విశ్రాంతి,ఉత్సాహం కలిగించేందుకు మహిళలు పాటలు పాడారని ఒక కథ చెబుతుంది.

ఆ పాటలతో కొత్త శక్తిని పొందిన దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిందని నమ్మకం.

అప్పటి నుంచి దుర్గమ్మను పూలతో అలంకరించి, ఆటపాటలతో బతుకమ్మగా ఆరాధించే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు.

మరో కథ ప్రకారం దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతైన సతీదేవికి ప్రతీకగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారు.

వివరాలు 

బతుకమ్మకు సంబంధించిన కథలు

ఆమె బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ విశ్వ చైతన్య శక్తికి ప్రతీకగా నిలిచిందని విశ్వాసం. ఆ పసిడి గౌరమ్మ రూపాన్నే తంగేడు పూలతో రూపొందించే బతుకమ్మగా భావిస్తారు.

చోళరాజు ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు వరపుత్రికగా అవతరించిన సిరులతల్లి శ్రీమహాలక్ష్మి రూపాన్ని కూడా బతుకమ్మతో అనుసంధానించే కథ ఉంది.

మరో కథ ప్రకారం చాళుక్య రాజులు రుద్రమదేవిపై అనూహ్యంగా దాడి చేసినప్పుడు.. ఆమె స్నేహితురాలు రుద్రమదేవిని కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసింది.

ఆ స్నేహితురాలి పార్థివ దేహాన్ని రాణి పూలపల్లకిలో ఊరేగించి తన పూలతోటలో సమాధి చేసిందని చెబుతారు.

ఆమె జ్ఞాపకార్థం పూలదొంతర్లతో నిర్వహించిన వేడుకే కాలక్రమంలో బతుకమ్మ పండుగగా మారిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది.

వివరాలు 

తొమ్మిది రోజులు.. తొమ్మిది పేర్లు

గ్రామ కూడళ్లలో, ఆలయ ప్రాంగణాల్లో,ఇళ్ల ఆవరణల్లో,చెరువుగట్ల వద్ద మహిళలు బతుకమ్మలను సామూహికంగా పేర్చి పాటలు పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తారు.

పెద్ద బతుకమ్మను తయారు చేసిన తర్వాత దాని పక్కనే మరో పళ్లెంలో చిన్న బతుకమ్మను కూడా పేర్చడం ఆనవాయితీ.

పసుపుబొట్టు పేరుతో మహిళలు తాంబూలం,ప్రసాదాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ప్రతి రోజుకు ప్రత్యేకమైన పేరు ఉంది.మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు.

వివరాలు 

తొమ్మిది రోజులు.. తొమ్మిది పేర్లు

బతుకమ్మకు నువ్వులు, బెల్లం, వేరుశనగ ఉండలు, అటుకులు, నవధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు, చక్కిలాలు, పెరుగన్నం, కొబ్బరి తురుము, మినప లడ్డూలు, పేలాల పిండి తదితర నైవేద్యాలను సమర్పిస్తారు.

అనంతరం వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

ఈ కాలంలో సాధారణంగా తీసుకునే ఈ సంప్రదాయ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ పొందడంలో ఉపయోగపడతాయని భావిస్తారు.

వివరాలు 

ప్రకృతితో మమేకమయ్యే పండుగ

సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో తొమ్మిది రోజుల పూల పండుగ ముగుస్తుంది.

బతుకమ్మను అత్తవారింటికి సాగనంపుతున్నట్లుగా భావిస్తూ.. వచ్చే ఏడాది మళ్లీ తమ వద్దకు రావాలని కోరుకుంటూ మహిళలు బతుకమ్మలను చెరువులు, ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. పూలతో అలరించిన బతుకమ్మ చివరికి ప్రకృతిలోనే మమేకమవుతుంది.

బతుకమ్మ కూర్పు, ఆటపాటలు, నిమజ్జనం.. సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలుగా భావిస్తారు.

ప్రకృతిని గౌరవించి, ఆరాధిస్తే అదే ప్రకృతి మన జీవనాన్ని కాపాడుతుందనే సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది.

అందుకే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

ADVERTISEMENT