Ragi Cookies Recipe: బయట కుకీస్‌కు చెక్.. ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీ రాగి బిస్కెట్లు ఇలా తయారు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
రోజూ టీ లేదా పాలు తాగేటప్పుడు పిల్లలు బిస్కెట్లు కావాలని మారాం చేయడం సాధారణమే. బయట మార్కెట్‌లో లభించే బిస్కెట్లలో మైదా, చక్కెర మోతాదుగా ఉండటంతో అవి పిల్లల ఆరోగ్యానికి హానికరమవుతాయి. ఈ సమస్యకు ఆరోగ్యకరమైన పరిష్కారంగా ఇంట్లోనే రాగి కుకీస్ తయారు చేసుకోవచ్చు. ఇవి చూడటానికి నాన్‌ఖటాయ్‌లా ఉండగా, బయటకు క్రిస్పీగా, లోపల మాత్రం మెత్తగా నోట్లో కరిగిపోయేలా ఉంటాయి. రాగి పిండి, గోధుమపిండి, పంచదార, నెయ్యి, యాలకుల పొడి కలయికతో తయారయ్యే ఈ కుకీస్‌కు అద్భుతమైన రుచి వస్తుంది. గుడ్లు లేకుండానే చేసే వీటిని వేడి చాయ్ లేదా పాలతో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఒకసారి తయారు చేసి డబ్బాలో భద్రపరిస్తే మూడువారాల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి.
Details
బెల్లం పొడిని ఉపయోగించవచ్చు
పంచదార ఆరోగ్యానికి హానికరమని భావిస్తే దాని స్థానంలో బెల్లం పొడి ఉపయోగించవచ్చు. అయితే అలా చేస్తే రుచి కొంచెం మారుతుంది. ఈ రెసిపీలో సగం రాగి పిండి, సగం గోధుమ పిండి వాడుతున్నందున ఇవి గ్లూటెన్ ఫ్రీ కావు. కావాలంటే పూర్తిగా గోధుమ పిండి లేదా ఇతర మిల్లెట్ పిండులతో కూడా తయారు చేయవచ్చు.
Details
తయారీ విధానం
వంట ప్రారంభించే ముందు పంచదారను మెత్తగా పొడి చేసుకోవాలి. ఐదు స్పూన్ల పంచదార పొడి చేస్తే సుమారు అర కప్పు వస్తుంది. దీనిని పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి వేసి, అందులో బేకింగ్ పౌడర్ (ఇష్టమైతే), యాలకుల పొడి కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత నెయ్యిని కరిగించి చల్లారనివ్వాలి. అందులో నుంచి సుమారు ఆరు స్పూన్ల నెయ్యిని పిండిలో పోసి చేత్తో కలపాలి. పిండి ఒకటిగా కుదరట్లేదనిపిస్తే ఇంకొంచెం నెయ్యి లేదా ఒకటి-రెండు స్పూన్ల పాలు వేసుకోవచ్చు.అవసరమైనంత మాత్రమే వాడాలి. సాధారణంగా ఏడు స్పూన్ల నెయ్యితో పిండి బాగా కుదురుతుంది. ఇప్పుడు పిండిని ఒక బంతిలా చేసి మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
Details
తయారీ విధానం1/2
తొందర ఉంటే పది నిమిషాలు ఫ్రీజర్‌లో పెట్టినా సరిపోతుంది. ఈలోపు ఓవెన్‌ను వేడి చేయాలి. తర్వాత పిండిని బయటకు తీసి చిన్న చిన్న బంతులుగా చేసి చేత్తో కొద్దిగా ఒత్తాలి. ఫోర్క్‌తో పైభాగాన్ని తేలికగా నొక్కితే ఆకారం బాగుంటుంది. బేకింగ్ ట్రేలో ఒక్కో బిస్కెట్ మధ్య కొంచెం దూరం ఉండేలా అమర్చాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత అవి కొంచెం పెద్దవిగా మారతాయి. ఓవెన్‌లో 12 నుంచి 14 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది. ఓవెన్ లేకపోతే కుక్కర్‌లో కూడా చేయవచ్చు. కుక్కర్ అడుగున ఉప్పు వేసి ముందుగా వేడి చేసి, గాస్కెట్, వెయిట్ తీసేసి మంట తక్కువగా పెట్టి ట్రేను లోపల పెట్టాలి.
Details
15 నిమిషాలు ఉడికిస్తే కుకీస్ రెడీ
12 నుంచి 15 నిమిషాలు ఉడికిస్తే కుకీస్ రెడీ అవుతాయి. అవసరమైతే రెండు మూడు బ్యాచుల్లో చేసుకోవచ్చు. బిస్కెట్లు మొదట్లో లోపల కొంచెం మెత్తగా అనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా చల్లారిన తర్వాత అవే గట్టిపడతాయి. పూర్తిగా చల్లారాక డబ్బాలో భద్రపరిస్తే మూడు వారాల వరకు చక్కగా ఉంటాయి. టేస్టీగా, క్రంచీగా ఉండే ఈ రాగి కుకీస్ పిల్లలకే కాదు పెద్దలకూ ఎంతో ఇష్టంగా ఉంటాయి.