Coconut Halwa: ఆహా ఏమి రుచి... కొబ్బరి హల్వా...చక్కెర అవసరం లేకుండానే
ఈ వార్తాకథనం ఏంటి
స్వీట్లు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే వంటకం కొబ్బరి హల్వా. సాధారణంగా హల్వా తయారీకి చక్కెర వాడుతారు. కానీ పచ్చి కొబ్బరి, బెల్లంతో కూడా రుచికరమైన హల్వా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో లేత కొబ్బరి ఉంటే ఈ స్వీట్‌ను కేవలం 10 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో, ప్రత్యేకమైన వంట నైపుణ్యం అవసరం లేకుండా తయారయ్యే ఈ కొబ్బరి హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం.
Details
కొబ్బరి హల్వాకు కావాల్సిన పదార్థాలు
- పచ్చి కొబ్బరి ముక్కలు - 1 కప్పు
పెసరపప్పు - 1 టేబుల్ స్పూన్
- బియ్యం - 1 టేబుల్ స్పూన్
- బెల్లం - అర కప్పు నుంచి ముప్పావు కప్పు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- నీళ్లు - పావు కప్పు
- యాలకుల పొడి - అర టీస్పూన్
Details
తయారీ విధానం
ముందుగా పాన్‌లో నూనె వేయకుండా పెసరపప్పు, బియ్యాన్ని సన్నని మంటపై దోరగా వేయించాలి.
రంగు మారగానే స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్‌లో కొబ్బరి ముక్కలు, బెల్లం, పావు కప్పు నీళ్లు వేసి వెన్నలాంటి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయాలి.
కొబ్బరి ముక్కలకు వెనుక ఉండే గట్టి పొరను తొలగిస్తే పేస్ట్ మరింత మెత్తగా వస్తుంది. తర్వాత పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేయించి పక్కన పెట్టాలి.
Details
రుచికరమైన హల్వా రెడీ
అదే పాన్‌లో కొబ్బరి పేస్ట్ వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి.
అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నెయ్యి వేయాలి. మిశ్రమం దగ్గరపడి నెయ్యి వదులుతున్నప్పుడు వేయించిన జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి కలిపి స్టవ్ ఆపేయాలి.
అంతే.. రుచికరమైన కొబ్బరి హల్వా సిద్ధం.
క్షణాల్లోనే సిద్దమయ్యే ఈ రెసిపీస్ వారాంతంలో చేసుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. ఫుడ్ లవర్స్‌కి ఇది అత్యంత ఇష్టమైన ఆహారంగా కూడా చెబుతారు