Fact check: 100 గ్రాముల సోయా చంక్స్‌లో గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ ఉందా?.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో శాకాహారులు,మాంసాహారులు ఇద్దరూ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో.. ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల స్థానంలో సోయా చంక్స్, పనీర్, పప్పుధాన్యాలు వంటి శాకాహార పదార్థాలను అందించే ప్రతిపాదన వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలకు వండిన మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను ఇస్కాన్‌కు అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుడ్లు, శాకాహార ప్రోటీన్ ఆహారాల పోషక విలువలపై నిపుణులు స్పందించారు.
వివరాలు
గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్
పోషకాహార నిపుణురాలు డాక్టర్ షబానా పర్వీన్ మాట్లాడుతూ.. ఎదుగుతున్న పిల్లలకు గుడ్లు అత్యంత పోషకమైన ఆహారాల్లో ఒకటని తెలిపారు. గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12, విటమిన్ డి, కొలిన్, ఐరన్ తదితర కీలక పోషకాలు ఉంటాయని చెప్పారు. ఇవి మెదడు అభివృద్ధి, కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తి, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని వివరించారు. అయితే గుడ్లలో ఉండే అన్ని పోషకాలను ఒకే శాకాహార పదార్థం పూర్తిగా భర్తీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. కానీ సోయాబీన్స్, సోయా చంక్స్, పనీర్, పాలు, పెరుగు, పప్పులు, బీన్స్, డ్రైఫ్రూట్స్, విత్తనాలతో కూడిన సమతుల్య శాకాహారాన్ని సరైన విధంగా తీసుకుంటే పిల్లలకు అవసరమైన పోషకాలను అందించవచ్చని సూచించారు.
వివరాలు
పిల్లలకు వయస్సును బట్టి ప్రోటీన్ అవసరం కూడా మారుతుంది
పిల్లలకు వయస్సును బట్టి ప్రోటీన్ అవసరం కూడా మారుతుందని డాక్టర్ షబానా తెలిపారు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు రోజుకు సుమారు 13 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుందని చెప్పారు. నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు 19 గ్రాములు, అంతకంటే పెద్ద పిల్లలకు రోజుకు కనీసం 34 గ్రాముల ప్రోటీన్ అవసరమని వివరించారు. ధాన్యాలు, పప్పుధాన్యాలు కలిపి తీసుకోవడం, వాటితో పాటు పాలు, పెరుగు, పనీర్, సోయా ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్, విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అందుతాయని చెప్పారు. ఒక్క ప్రోటీన్ ఆహారంపైనే ఆధారపడకుండా సమతుల్యమైన, వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచించారు.
వివరాలు
పప్పుల్లో సుమారు 25గ్రాములు,పనీర్‌లో సుమారు 22గ్రాముల ప్రోటీన్
ఇదిలా ఉండగా,ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ఇటీవల మాట్లాడుతూ.. 100గ్రాముల గుడ్లలో సుమారు 13గ్రాముల ప్రోటీన్ ఉంటే,100గ్రాముల పొడి సోయా చంక్స్‌లో 52 నుంచి 54గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పప్పుల్లో సుమారు 25గ్రాములు,పనీర్‌లో సుమారు 22గ్రాముల ప్రోటీన్ ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన డాక్టర్ షబానా.. ఈ ప్రోటీన్ గణాంకాలు దాదాపు సరైనవేనని, అయితే వాటిని సరైన సందర్భంలో అర్థం చేసుకోవాలని అన్నారు. 100గ్రాముల పొడి,ఉడికించని సోయా చంక్స్‌లో 50 నుంచి 52గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుందని, పొడి పప్పుల్లో 24 నుంచి 26 గ్రాములు,పనీర్‌లో తయారీ విధానాన్ని బట్టి 18 నుంచి 22గ్రాములు, 100 గ్రాముల గుడ్లలో సుమారు 13గ్రాముల ప్రోటీన్ ఉంటుందని వివరించారు.
వివరాలు
గుడ్లలో శరీరానికి సులభంగా జీర్ణమయ్యే నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు కొలిన్
అయితే కేవలం ప్రోటీన్ పరిమాణం ఆధారంగా ఆహారాలను పోల్చడం సరైన విధానం కాదని ఆమె స్పష్టం చేశారు. గుడ్లలో శరీరానికి సులభంగా జీర్ణమయ్యే నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు కొలిన్, విటమిన్ బి12, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు సోయా, పాల ఉత్పత్తులు, పప్పులు కూడా విలువైన పోషకాలను అందిస్తాయని చెప్పారు. అందువల్ల కేవలం ప్రోటీన్ సంఖ్యలను కాకుండా మొత్తం ఆహార నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
వివరాలు
100 గ్రాముల గుడ్లు అంటే..
అలాగే ఈ పోలికలన్నీ 100 గ్రాముల ఆధారంగా చేసినవేనని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల గుడ్లు అంటే సాధారణంగా రెండు మధ్యస్థ పరిమాణం గల గుడ్లతో సమానం. కానీ 100 గ్రాముల ఉడికించిన సోయా చంక్స్ సాధారణంగా చాలా పెద్ద మోతాదులో ఉంటాయి. అందువల్ల గుడ్లు, సోయా మధ్య పోషక విలువలను పోల్చేటప్పుడు సాధారణంగా తీసుకునే పరిమాణం, మొత్తం పోషక విలువలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.