Fathers Day: నాకోసం... నాన్న జీవితాంతం పెళ్లి చేసుకోలేదు!
ఈ వార్తాకథనం ఏంటి
రక్తసంబంధం లేకపోయినా, కన్నబిడ్డకంటే ఎక్కువ ప్రేమతో ఆమెను కాపాడాడు. సమాజం "ఆడపిల్ల భారం" అంటూ ఎన్నో విమర్శలు చేసినా, "ఈ చిన్నారి నాకు దేవుడు ప్రసాదించిన వరం" అని గర్వంగా చెప్పాడు. ఆమెను కేవలం పెంచడమే కాదు, చదివించి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించేలా ప్రోత్సహించాడు. అలాంటి అపూర్వమైన తండ్రి ప్రేమకు ఇది సజీవ సాక్ష్యం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అసోంలోని తిన్సుకియా గ్రామంలో సొరబెన్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఒక రోజు ఎప్పటిలాగే వీధుల్లో కూరగాయలు విక్రయిస్తుండగా, ఓ చెట్టు వెనుక ఉన్న చెత్తకుండీ దగ్గర నుంచి పసికందు ఏడుపు వినిపించింది. చాలామంది లాగే "మనకెందుకులే" అని వెళ్లిపోకుండా, ఆ శబ్దం వైపు వెళ్లి చూశాడు.
వివరాలు
శిశువును చూసి అతని మనసు కరిగిపోయింది..
అక్కడ చీమలు కుట్టి గాయాలతో, రక్తస్రావమవుతూ అల్లాడుతున్న ఓ నవజాత శిశువును చూసి అతని మనసు కరిగిపోయింది. వెంటనే ఆ బిడ్డను ఎత్తుకుని నీళ్లతో శుభ్రం చేశాడు. అనంతరం చుట్టుపక్కల ఆమె తల్లిదండ్రుల కోసం ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదు. చివరికి ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో సొరబెన్‌కు కేవలం 29 సంవత్సరాల వయస్సు మాత్రమే. కుటుంబ సభ్యులు "ఆడపిల్లను పెంచడం పెద్ద బాధ్యత. మన జీవితం గడవడమే కష్టంగా ఉంది. ఈ బాధ్యత ఎందుకు?" అని ఎంతగా వారించినా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ పాపను సొంత కూతురిలా పెంచాలని సంకల్పించాడు. ఆమెకు "జ్యోతి" అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా పెంచాడు.
వివరాలు
అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగం..
తన జీవితంలో తండ్రి చేసిన త్యాగాల గురించి జ్యోతి భావోద్వేగంగా మాట్లాడుతూ, "నాన్న లేకపోయి ఉంటే నేను ఈరోజు బతికే ఉండేదాన్నో కాదో కూడా తెలియదు. నాకోసం ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి నన్ను చదివించారు. 'నువ్వు బాగా చదివితేనే అందరి గౌరవాన్ని సంపాదించగలవు' అని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆయన కష్టం, నా పట్టుదల కలిసి నన్ను అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగం సాధించే స్థాయికి తీసుకువచ్చాయి" అని ఫలితాలు ప్రకటించిన అనంతరం తన జీవిత కథను పంచుకుంది.
వివరాలు
తండ్రి ప్రేమ అంటే అదే..
ఈ సంఘటన జరిగి పన్నెండేళ్లు దాటినా, తండ్రీ-కూతుళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ హృదయాన్ని కదిలించే కథ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తూనే ఉంది. నాన్నకు కూతురిగా పుట్టడం అంటే జీవితాంతం ఒక రక్షణ కవచం లభించినట్టే. ఈ భావాన్ని మరింత అందంగా చెప్పే ఓ చిన్న సంఘటన ఉంది. "నాన్నా... పులి!" అనే కథ విన్న ఒక చిన్నారి, "ఆ కథలోని పిల్లకు నాన్న రాలేదేమో, కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా మా నాన్న మాత్రం వెంటనే వస్తాడు" అని అమాయకంగా చెప్పిందట. తండ్రి ప్రేమకు, ఆయన ఆప్యాయతకు ఇంతకంటే గొప్ప నిర్వచనం మరొకటి ఉండదు.