LOADING...
Smartphone Reels: స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం 1 గంట సోషల్ మీడియా రీల్స్ చూడటం ఎంత ప్రమాదమో తెలుసా?తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! 
తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Smartphone Reels: స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం 1 గంట సోషల్ మీడియా రీల్స్ చూడటం ఎంత ప్రమాదమో తెలుసా?తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ కాలం గడిపే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త అవసరం. ఎందుకంటే తాజాగా వెలువడిన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, ఈ అలవాటు కళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం ఒక గంటపాటు కూడా ఫోన్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తే కంటి అలసట మరింత పెరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఫోన్ వాడే వ్యవధి మాత్రమే కాదు, అందులో చూసే కంటెంట్ స్వభావం కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధ్యయనం తేల్చింది.

వివరాలు 

భారతీయ యువతపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ పరిశోధన 

ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన నిపుణులు చేసిన ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఐ మూవ్‌మెంట్ రీసెర్చ్లో ప్రచురించబడ్డాయి. పుస్తక పఠనం లేదా సాధారణ వీడియోల వీక్షణతో పోలిస్తే, రీల్స్ చూస్తున్నప్పుడు కంటి పాపల కదలికల్లో ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయని వారు గుర్తించారు. స్క్రీన్ వెలుతురు,దృశ్యాల వేగవంతమైన మార్పులు ఇందుకు కారణమని వివరించారు. దీని ప్రభావంగా రెప్పపాటు తగ్గి, కళ్లు పొడిబారడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది యువతపై ప్రత్యేక పరికరాల సహాయంతో విశ్లేషణ చేశారు.

వివరాలు 

83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు 

గంటపాటు స్మార్ట్‌ఫోన్ వాడిన తర్వాత, పాల్గొన్న వారిలో 60 శాతం మంది కంటి అలసటతో పాటు మెడ నొప్పి, చేతుల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అంతేకాకుండా, వారిలో 83 శాతం మంది నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అలసట వంటి శారీరక, మానసిక రుగ్మతలకు లోనయ్యారని అంగీకరించారు. 20 నిమిషాలకు మించి నిరంతరాయంగా ఫోన్ వాడకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా కంటి సమస్యలు, నిద్రలేమి వంటి రుగ్మతలు పెరుగుతాయని తెలిపారు. అయితే, ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది బ్లూ లైట్ ఫిల్టర్లు, డార్క్ మోడ్ వంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పడం ఒక మంచి పరిణామమని పరిశోధకులు పేర్కొన్నారు.