ప్రేరణ: అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో పనిని మొదలుపెట్టడంలో ఆలస్యం పనిని ఆపేసే ప్రమాదం
మీరొక పని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ పని గురించి మీకేమీ తెలియదు. అందుకోసమే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ లో ఆ పని గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తున్నాయి. ఆ పని ఎలా చేయాలో, ఎలా చేయకూడదో, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుంటున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంతా తెలుసుకుని పని మొదలు పెట్టాలని మీ ప్లాన్. రోజులు గడుస్తున్న కొద్దీ ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉందనే ఫీలింగ్ మీలో ఆవరించింది. ఒక దశలో మీరు చేయాలనుకున్న పనివల్ల మీకు నష్టం కలుగుతుందేమోనన్న ఆలోచన వచ్చింది. దాంతో మీరు ఆ పనిని మొదలుపెట్టలేకపోయారు.
పర్ఫెక్ట్ గా చేయాలనే ఆలోచన కన్నా పని మొదలుపెట్టడం ముఖ్యం
పైన తెలిపిన ఉదాహరణలో మీరసలు పనే మొదలుపెట్టలేదు. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేద్దామనుకుని పని మొదలెట్టడం ఆలస్యం చేసారు. తీరా ఏమీ చేయలేకపోయారు. చాలామంది ఇదే చేస్తుంటారు. పర్ఫెక్ట్ అన్న ఆలోచనలో అసలు పనిని ముట్టుకోరు. అలాంటి వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, పనిలో దిగితేనే పర్ఫెక్ట్ అవుతారు, కూర్చుని చూస్తే కాదు. ఒక పని చేస్తుంటేనే దాంట్లో ఎదురయ్యే అనుభవాలే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాయి. అందుకే ముందుగా దూకేయడమే మంచిది. అలా అని గుడ్డిగా దూకమని కాదు. పనికి సంబంధించి కొంత జ్ఞానం సరిపోతుంది. పనిలో దిగాక నువ్వద్దన్నా జ్ఞానం అదే వస్తుంది.