ప్రేరణ: నిన్ను పైకి లేపాల్సింది వేరే వాళ్ళు కాదు, నీ చేతులే
రోజులు మారిపోతున్నాయ్, ప్రపంచమే మారిపోతోంది. ఈ సమయంలో అవతలి వారికి సాయం చేయాలన్న ఆలోచన తగ్గిపోతోంది. పక్కనున్న వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కరువైపోతున్నారు. ఇలాంటి సమయంలో నీకు నువ్వే సాయం చేసుకోవాలి. నీ తప్పుల వల్ల పైకి లేవలేకపోతున్నా కూడా నిన్ను లేపేవాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే నెమ్మదిగా లేచి ఒక చేతి సాయంతో ఇంకో చేతిని పైకి లేపాల్సిందే. విజయం వైపు వెళ్లాల్సిందే. లేదంటే నిన్నో పనికిరాని వాడిగా గుర్తించి నీ గురించి ఎవ్వరికీ గుర్తులేకుండా చేసేస్తుంది ఈ ప్రపంచం. అలా జరగకముందే మేలుకో. నిన్ను నువ్వు మేలుకొల్పుకో. నీ కళ్ళు నువ్వు తెరిపించుకో. ప్రపంచాన్ని సరిగ్గా చూడు. నీకన్నా ఎంత ముందుకెళ్తుందో గమనించుకో. వెంటనే పరుగు ప్రారంభించు.
ఎవరోవస్తారని అనుకున్న ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయి
నీ గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించేది కేవలం నువ్వేననీ నువ్వు గుర్తించాలి. లేదంటే నువ్వు నిరాశపడతావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడా కనిపించరు. అందరికీ స్వార్థమే. అది తెలుసుకుని ఛీ, ప్రపంచం ఏంటి ఇలా తయారయ్యిందని నువ్వు ఫీలవ్వాల్సిన పనిలేదు, ఎందుకంటే నువ్వు బాగున్నప్పుడు, నువ్వు కూడా ఇతరులకు ఎలాంటి సాయం చేయలేదు. చాలామంది ఇదే విషయం మర్చిపోతారు, కానీ నువ్వు మర్చిపోకు. అలాంటప్పుడే ప్రపంచం మీద అసహ్యం ఏర్పడకుండా ఉండి, నీలోఆలోచన కలుగుతుంది. అయితే ఒక్క విషయం, నీకు నువ్వు సాయం చేసుకుని ఎదుగుతున్నప్పుడు నీకు దారిలో కనిపిస్తున్న వారికి ఎంతో కొంత సాయం చెయ్యి. అదొక్కటే నీకు నువ్వు వెళ్తున్న దారిలో తృప్తినిస్తుంది.