ప్రేరణ: ఏం ఆలోచిస్తావో అదే అవుతావ్, అందుకే బీ పాజిటివ్
మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా తయారవుతారు. అందుకే మనసుకు ఎప్పుడూ మంచి ఆలోచనల్నే ఇవ్వాలి. ఆశావాదాన్నే అలవాటు చెయ్యాలి. అలాగే మీ చుట్టూ నిరాశవాదులు, లేదా చెడు ఆలోచనలు చేసే వారున్నా వారి నుండి దూరం జరగండి. ఆ ఆలోచనలు మీక్కూడా అంటుకునే ప్రమాదం ఉంది. ఆరు నెలలు ఒకరితో సావాసం చేసే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని అంటారు. అది నిజం. ఆశావాదులతో ఉంటే జీవితం మీద అశ, కోరిక పెరుగుతుంది. నిరాశ వాదులతో ఉంటే, నా జీవితం ఇలా ఎందుకయ్యిందని పదే పదే నిరాశ పడిపోవాల్సి ఉంటుంది. మీరెప్పుడూ పడిపోకూడదు, పడ్డా లేవగలగాలి. అందుకే మీ ఆలోచనలను మార్చుకోవాలి.
చెడు ఆలోచనలు దూరం చేస్తే మంచి జరుగుతుంది
ఎడారిలో ఉన్నా కూడా ఒయాసిస్ ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చెడుగా ఆలోచిస్తే మీరు చెడ్డవాళ్లవుతారు. మంచిగా ఆలోచిస్తే మంచి వాళవుతారు. ఇక్కడ మంచి చెడు అనేది అవతలి వారికి సంబంధించిన విషయాల్లో కాదు, మీకు సంబంధించిన విషయాల్లోనే. మీరు చెడుగా మారితే మీకే చెడు జరుగుతుంది. అందుకే మీలో వస్తున్న చెడు ఆలోచనలను మంచి ఆలోచనలతో కప్పేయండి. తప్పు చేయకూడదంటే తప్పుగా ఆలోచించకూడదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఆలోచనల మీద మీకు నియంత్రణ కలిగి ఉండాలి. లేదంటే అవి విచ్చలవిడిగా మారిపోయి, మీ జీవితాన్ని చెల్లాచెదురుగా మారుస్తాయి. ఒక్కసారి చెడ్డ ఆలోచనలకు బానిసగా మారితే, ఇక మీ జీవితం మీ కంట్రోల్ లో ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా మలుపులు తీసుకుంటుంది.