విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది
విజయం వచ్చాక నీ చుట్టూ చాలామంది చేరతారు. నిన్ను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతారు. నీకన్నా తీస్ మార్ ఖాన్ ఎవ్వరూ లేరని, రారని అంటుంటారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజమేనని నువ్వు ఒక్కక్షణం అనుకున్నా చాలు, మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్టే. విజయం వచ్చేముందు ఎంత కష్టపడ్డావో విజయం వచ్చాక అంత జాగ్రత్తగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోయి నీ ప్రపంచంలో నువ్వు తూలుతుంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా పోతుంది. అప్పుడు నీ తెలివి తగ్గిపోతుంది. నీ నిర్ణయాలు బెడిసి కొడుతుంటాయి. తద్వారా మెల్లగా అధఃపాతాళానికి పడిపోతావ్. అందుకే విజయం రాగానే కొండెక్కి కూర్చోకూడదు. కొండ మీద నుండి కిందపడితే దెబ్బ గట్టిగా తగులుతుందని గుర్తుంచుకోవాలి.
అహంకారం ఉన్నవాళ్ళు పడిపోయేది అధఃపాతాళానికే
విజయం వచ్చాకా చాలామంది చేసే తప్పు అహంకారాన్ని తలకెక్కించుకోవడం. అలాంటి వాళ్ళకు నేను, నేను, నేను అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. ఆ ఫీలింగే వాళ్లను కిందపడేస్తుంది. కాకపోతే దానికి కొంత టైమ్ పడుతుంది. అహంకారం ఎక్కువైనపుడు పడిపోయేది పాతాళానికే అని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విజయం వచ్చినపుడు మరింత అణకువ అవసరం. విజయం రానంతవరకు పడ్డ కష్టం కంటే విజయం వచ్చాకే ఎక్కువ కష్టపడాలి. లేదంటే నిన్ను పక్కకు తోసేసి, వేరే వాళ్ళు నీ దారిలోకి వచ్చేస్తారు. అందుకే అహంకారం ఎంత తక్కువుంటే అంత మంచిదన్న సంగతి గుర్తుంచుకోండి. నేను అన్న ఫీలింగ్ ని మానుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడతారు.