ప్రేరణ: పదేళ్ల తర్వాత నువ్వేమవుతావ్ అనేదానికి సమాధానం మీ దగ్గరుందా? అసలేంటి నీ లక్ష్యం?
ఈరోజు జీవిస్తున్నామంటే దానికి కారణం రేపటి మీద ఆశ. ఆ ఆశే లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఆ ఆశ పేరే లక్ష్యం. మీకంటూ ఒక లక్ష్యం ఉందా? ఒక్కసారైనా ఆలోచించారా? పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని చిన్నతనంలో ఎవరైనా అడిగితే డాక్టర్, ఇంజనీర్ అని సమాధానం చెప్పారు. ఇప్పుడు మీకు పాతికేళ్ళు వచ్చాయి. ఇప్పుడు మిమ్మల్ని, ఒక పదేళ్ల తర్వాత ఏం చేస్తావ్ అని అడిగితే ఏం చెప్తారు. ఇప్పుడు చేస్తున్న దానికన్నా పెద్ద జాబ్, మంది శాలరీ అంటారా? ఓకే.. ఏదైనా సరే, మీకు ఆ విషయంలో ఒక క్లారిటీ ఉందా? లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఏదో బతికేద్దాం అన్నట్టుగా ఉంటే మీకు విజయం దొరకదు.
లక్ష్యం ఉన్నవాళ్ళు జీవిస్తారు, లేనివాళ్ళు కేవలం బ్రతుకుతారు
లక్ష్యం అనేది లేకపోతే జీవితం చప్పగా సాగుతూ ఉంటుంది. కొంచెం కూడా కిక్ ఉండదు. ఎక్సైట్ మెంట్ అసలే ఉండదు. ఒక వయసుకు రాగానే నిరాశ ఆవహించేది లక్ష్యం లేకపోవడం వల్లనే. మీరు కూడా అలాగే ఉంటారా? లేక ఈరోజే ఏదైనా లక్ష్యం పెట్టుకుంటారా? లక్ష్యం పెట్టుకుంటూ దాని కోసం పనిచేస్తున్నప్పుడు లభించే తృప్తి, ఏ లక్ష్యమూ లేకుండా దేనికోసం పనిచేస్తున్నామో తెలియకుండా చేస్తున్నప్పుడు కలగదు. ఒక పదేళ్ళ తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియకపోతే మీరు తప్పు దారిలో వెళ్తున్నట్లు లెక్క. అనుకోని పరిణామాల వల్ల మీ జీవితం తల్లకిందులు అవుతుండవచ్చు. కానీ మీకంటూ ఓ లక్ష్యం ఉంటేనే రేపటి మీద ఆశ కలుగుతుంది. బ్రతకాలన్న ఆశ పెరుగుతుంది.