ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5: అమెరికాను భయపెడుతున్న కరోనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు
కరోనా కథ కంచికి వెళ్ళిందనుకునే లోపే కళ్ళముందు కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా దాదాపు 38దేశాల్లో కొత్త రూపమైన XBB.1.5 విలయ తాండవం చేస్తోంది. ఈ కరోనా కొత్త రూపం వల్ల అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో XBB.1.5రూపం గురించి తెలుసుకుందాం. XBB.1.5 అనేది ఓమిక్రాన్ సబ్ వేరియంట్. 2022 అక్టోబర్ లో అమెరికాలో దీన్ని గుర్తించారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రూపాంతరం అని చెబుతున్నారు. BA.4, BA.5 వేరియంట్ల కంటే 49రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. F486p అనే పరివర్తనం ద్వారా శరీరంలోకి ఈ వేరియంట్ చేరుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకైతే ఈ కరోనా కొత్తరూపం ప్రమాదమైనదని ఎవ్వరూ చెప్పలేదు.
XBB.1.5 రకం కరోనా వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి
జనవరి 11వ తేదీన అమెరికా ప్రచురించిన ఇంటర్నల్ రిస్క్ మేనెజ్ మెంట్ కథనం ప్రకారం, ప్రమాదానికి దారి తీసే జన్యుపరమైన మార్పులు ఈ వేరియంట్ లో జరగడం లేదని తెలిపారు. కానీ ఈ రకం కరోనా సోకిన వారిలో లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగుతాయని అన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సిడీసి) ప్రకారం, అమెరికాలో దాదాపు 48శాతం కరోనా కేసులు ఈ రకం వేరియంట్ వల్ల నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది. ఓమిక్రాన్ వేరియంట్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అవే లక్షణాలు ఉంటాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం మొదలగునవి కనిపిస్తాయి.