Miss Universe 2026 Winner: మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన 75వ మిస్ యూనివర్స్ పోటీలు ముగిశాయి. ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు విజేత కిరీటాన్ని అలంకరించారు. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా ఎంపికయ్యారు. భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు సంపాదించారు.
వివరాలు
జెన్నిఫర్‌కు కిరీటం అందించిన ప్రశ్న ఇదే..
అయితే, టాప్-12లోకి ప్రవేశించలేకపోవడంతో ఆమె మిస్ యూనివర్స్ ప్రయాణం ముగిసింది.
మిస్ యూనివర్స్ ఫైనల్ రౌండ్‌లో మిగిలిన ఐదుగురు పోటీదారులకు న్యాయనిర్ణేతలు ఒక కీలకమైన ప్రశ్న అడిగారు.
'ప్రస్తుత ప్రపంచానికి నాయకుల నుంచి ఎలాంటి లక్షణాలు అవసరం?' అని ప్రశ్నించారు.
దీనికి జెన్నిఫర్ బారెటో ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.
ప్రపంచానికి వృత్తిపరమైన నైపుణ్యాలు కలిగిన నాయకులతో పాటు, ఇతరుల భావాలను అర్థం చేసుకునే సహానుభూతి కూడా ఉన్న నాయకులు అవసరమని ఆమె చెప్పారు.
ఇతరులను విమర్శించడం కంటే వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.
అలాగే, నాయకులు తమ విలువలకు కట్టుబడి ఉండటంతో పాటు, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. ఆమె ఇచ్చిన సమాధానం విజేతగా నిలవడంలో కీలకంగా మారింది.
వివరాలు
75 ఏళ్ల వేడుక.. ప్రత్యేకంగా రూపొందించిన కిరీటం
మిస్ యూనివర్స్ పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాదితో ఈ పోటీలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేకమైన కిరీటాన్ని రూపొందించారు.
'ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ' (The Radiance of an Eternal Legacy) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను ఉపయోగించారు. 75వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ కిరీటాన్ని విజేతకు అందించారు.
వివరాలు
ప్యూర్టోరికోకు ఆరోసారి విశ్వసుందరి కిరీటం
జెన్నిఫర్ బారెటో విజయంతో ప్యూర్టోరికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ టైటిల్ లభించినట్లయింది.
గతంలో ఆ దేశానికి చెందిన ఐదుగురు అందాల భామలు ఈ ఘనత సాధించారు.
1970, 1985, 1993, 2001, 2006, 2026 సంవత్సరాల్లో ప్యూర్టోరికోకు చెందిన అందాల భామలు విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక 2027లో జరగనున్న 76వ మిస్ యూనివర్స్ పోటీలకు వియత్నాం ఆతిథ్యం ఇవ్వనుంది.